KTR: ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు.. ప్రధానికి కేటీఆర్‌ లేఖ!

|

Jun 09, 2022 | 9:55 PM

దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధానమంత్రి విఫలమవ్వడమేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని..

KTR: ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు.. ప్రధానికి కేటీఆర్‌ లేఖ!
Ktr Demands Pm Modi
Follow us on

KT Rama Rao questions PM Narendra Modi on 16 lakh vacancies: యువ‌త ఉద్యోగ- ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై ప్రధాని నరేంద్ర మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గురువారం (జూన్‌ 9) బ‌హిరంగ లేఖ‌ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేసిన మోదీ సర్కార్‌ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఇంకా ఈ విధంగా ప్రశ్నించారు.. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధానమంత్రి విఫలమవ్వడమేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ప్రైవేట్ పరమైన సంస్థల్లో రిజర్వేషన్ అమలుకాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవ‌కాశాలు దక్కవు. ఈ విషయంలో ఆయా వర్గాల యువతకు తీరని నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికే 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ ఏడాది మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. ప్రైవేటు రంగంలో 16 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యత ఏమిటని ప్రశ్నించారు.

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ/ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 8 యేళ్లుగా తెలంగాణ యువత తరఫున డిమాండ్‌ చేస్తున్నాము. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు ద్వారా పెద్ద దెబ్బ కొట్టారు. పారిశ్రామిక, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంశించింది. మాకున్న పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తున్నాం. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించే విషయంలో మీకు స్పష్టమైన విధానం లేదు.

ఇవి కూడా చదవండి

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం రంగంతో పాటు, టెక్స్ టైల్ రంగం కూడా ముఖ్యమైనదే. ఈ రెండు రంగాలను మీరు విస్మరించడంతో దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. మీరు అనుసరిస్తున్న విధానాల వ‌ల్ల గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న 16 లక్షల ఉద్యోగాలభర్తీకి ఏం చర్యలు తీసుకుంటారో తెల్పమని, లేదంటే రాష్ట్ర యువతతో కలిసి ఉద్యోగాల భ‌ర్తీ జ‌రిగేదాకా ఉద్యమిస్తామన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీకి ఉద్యోగాల భర్తీ పైన మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.