Kerala High Court: వైవాహిక అత్యాచారం అంశంలో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైవాహిక అత్యాచారం.. విడాకులు తీసుకునేందుకు సరైన కారణమని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. కేరళకు చెందిన ఓ మహిళ.. వైవాహిక అత్యాచారాన్ని కారణంగా చూపుతూ తనకు విడాకులు ఇప్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయ నివేదిక ప్రకారం.. భార్య స్వయంప్రతిపత్తిని విస్మరించి భర్త చేసిన లైంగిక సంపర్కం వైవాహిక అత్యాచారంగా పరిగణించబడుతుంది. ఇలాంటి ప్రవర్తనకు చట్టపరంగా శిక్షించలేనప్పటికీ.. అది శారీరక, మానసికంగా హింసించడంగా పరిగణించడం జరుగుతుంది.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వైవాహిక అత్యాచారాలను విడాకులకు సరైన కారణంగా పేర్కొంటూ.. జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ కౌసర్ ఎడప్పాగత్ తో కూడిన డివిజన్ బెంచ్ ఇలా కామెంట్స్ చేసింది. ‘‘వైవాహిక అత్యాచారాలను చట్టం గుర్తించలేదనే కారణంతో.. కోర్టు గుర్తించకుండా ఉండదు. అందువల్ల విడాకాలు తీసుకోవటానికి వైవాహిక అత్యాచారం సరైన కారణమని మేము అభిప్రాయపడ్డాము.’’ అని ధర్మాసనం పేర్కొంది.
విడాకులు కోరిన మహిళ అత్యంత దారుణమైన లైంగిక, శారీరక వేధింపులకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని న్యాయస్థానం పేర్కొంది. మహిళ అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతని తల్లి మరణించిన రోజున కూడా మహిళ భర్త ఆమెను బలవంతం చేశాడు. ఇంకా ఆమెతో అసహజ శృంగారం చేయడమే కాకుండా.. మైనర్ పిల్లల ముందు లైంగికంగా కలిసినట్లు బాధిత మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది. మహిళ ఎదుర్కొన్న చిత్రహింసలను గుర్తించిన కేరళ హైకోర్టు.. విడాకులు కోరడానికి అమె అన్ని హక్కు ఉన్నాయని తేల్చింది. భార్య తాను చెప్పినట్లు నడుచుకోవాలని భర్త భావించినప్పుడు వైవాహిక అత్యాచారాలు జరుగుతాయని కోర్టు అభిప్రాయపడింది. ఏ భర్త అయినా సరే తన భార్య శారీరక, వ్యక్తిగత హక్కులపై క్లెయిమ్ చేయలేడని స్పష్టం చేసింది.
Also read:
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన్వీనర్ కోటా..
Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..