Kerala Floods: వర్షం బీభత్సం.. 21కి చేరిన మృతుల సంఖ్య.. సహాయక చర్యలు ముమ్మరం..!

|

Oct 17, 2021 | 7:37 PM

Kerala Floods: భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం బీభత్సం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా కేరళ రాష్ట్రంలో బీభత్సం..

Kerala Floods: వర్షం బీభత్సం.. 21కి చేరిన మృతుల సంఖ్య.. సహాయక చర్యలు ముమ్మరం..!
Follow us on

Kerala Floods: భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం బీభత్సం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా కేరళ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 21కి చేరింది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడి మృత్యువాత పడుతున్నారు. మరణించిన వారిలో 13 మంది కొట్టాయంకు చెందిన వారు ఉండగా, 8 మంది ఇడుక్కి జిల్లాకు చెందిన వారున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరికొంత మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కొట్టాయం జిల్లా కలెక్టర్‌ పీకే జయశ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ రాత్రికి మళ్లీ భారీ వర్షం కురిస్తే మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.

ఈ భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ..

కేరళలో వర్షాలు బీభత్సంతో మృతి చెందిన వారి పట్ల ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడారు. వరదలు, కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Agriculture States: భారతదేశంలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసే ఐదు రాష్ట్రాలు.. ఆ రాష్ట్రం మొదటి స్థానంలో..

Kerala Floods: కేరళకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నాం: కేంద్రమంత్రి అమిత్‌షా