లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు. దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై విచారణ 22కి వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత. విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్ విచారణను జులై 22కు వాయిదా వేసింది. వాయిదా వేస్తున్న విషయాన్ని ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
మార్చి 16న అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను విచారణ పేరుతో రిమాండుకు తరలించారు. 100 రోజులు దాటినప్పటికీ ఆమెకు బెయిల్ విషయంలో అనేక ఇబ్బందులు తప్పడంలేదు. ఈడీ కేసుతో పాటూ సీబీఐ కూడా ఇందులో జోక్యం చేసుకుంది. చార్జ్ షీట్లో కవిత పేరును పేర్కొంది. దీనిపై స్పందించారు కవిత తరఫు న్యాయవాది. విచారణ సమయంలో సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు సీబీఐ తరఫు న్యాయవాది. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.
చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు. చార్జ్‌షీట్‌లో తప్పులుంటే కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత లాయర్ నితీష్ రాణా తెలిపారు. డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌పై తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని కోరారు కవిత లాయర్. చార్జ్‌షీట్ పూర్తిగా లేదని తాము వాదించడం లేదని, తప్పుగా ఉందని మాత్రమే చెబుతుననట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ తాము సరైన పద్దతిలో చార్జ్‌షీట్ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది. దీంతో 60 రోజుల తరువాత డిఫెక్టివ్ చార్జ్‌షీట్ దాఖలు చేయడం కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలరాయడమేనన్నారు కవిత న్యాయవాది.
కవిత డిఫాల్ట్ బెయిల్, సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది. దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయి 119 రోజులుగా జూడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు జూలై 18 వరకూ కస్టడీ పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది కోర్టు. దీంతో బెయిల్ పిటిషన్ పై ఇప్పట్లో స్పష్టమైన ఆదేశాలు వెలువడే పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు న్యాయనిపుణులు. జూలై 22 తరువాత చేపట్టే విచారణలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు న్యాయవాదులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…