AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. హత్య చూసిన కొడుక్కి ఏం చేశారో తెలుసా?

బెంగళూరులో జరిగిన అభినందన్, చిన్న కుమారుడి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను చంపేందుకు భార్య హరిణి తన ప్రియుడు వినయ్‌తో కలిసి పక్కా ప్రణాళిక వేసింది. ఈ కుట్రలో భాగంగా, శబ్దం విని మేల్కొన్న చిన్న కుమారుడిని కూడా దారుణంగా హత్య చేశారు. ఈ డబుల్ మర్డర్ కేసులో పోలీసులు హరిణిని అదుపులోకి తీసుకోగా, వినయ్ కోసం గాలిస్తున్నారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. హత్య చూసిన కొడుక్కి ఏం చేశారో తెలుసా?
Bengaluru Double Murder
Balaraju Goud
|

Updated on: Aug 18, 2026 | 4:39 PM

Share

బెంగళూరులో జరిగిన తండ్రీకొడుకుల దారుణ హత్య కేసు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర బెంగళూరులో 38 ఏళ్ల అభినందన్, అతడి చిన్న కుమారుడు హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అభినందన్ భార్య హరిణిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆమె ప్రియుడు వినయ్ కోసం గాలిస్తున్నారు. ఇద్దరూ కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అభినందన్, హరిణి 2021లో వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో 2024 డిసెంబర్‌లో హరిణికి స్నాప్‌చాట్ ద్వారా వినయ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తన భార్య మరొక వ్యక్తితో మాట్లాడుతోందని అభినందన్‌కు అనుమానం రావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. హత్యలకు సుమారు 15 రోజుల ముందు అభినందన్ తన భార్య కాల్ వివరాలపై పోలీసులను సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. హరిణి తన భర్త నుంచి విడాకులు తీసుకుని వినయ్‌తో కలిసి జీవించాలని భావించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఆగస్టు 14న మరోసారి దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం హరిణి వినయ్‌తో మాట్లాడి భర్తను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ముందుగానే ఇద్దరూ గ్లౌజులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను కూడా ముందుగానే ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆదివారం (ఆగస్టు 16) రాత్రి సుమారు 11 గంటల సమయంలో వినయ్ ఇంటికి వచ్చి గ్యారేజ్ సమీపంలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అభినందన్ నిద్రపోయిన తర్వాత హరిణి అతడిని ఇంట్లోకి తీసుకెళ్లింది. భర్త నిద్రలో ఉన్నాడని నిర్ధారించుకునేందుకు ఆమె పలుమార్లు గదిని పరిశీలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అర్ధరాత్రి సమయంలో హరిణి, వినయ్ కలిసి అభినందన్‌పై దాడి చేశారు. వినయ్ అతడిని ఊపిరాడకుండా చేయగా, హరిణి అతడి కాళ్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సమయంలో జరిగిన శబ్దానికి వారి చిన్న కుమారుడు మేల్కొన్నాడు. ఈ ఘటనను చూసిన బాలుడిని కూడా వదిలిపెట్టకుండా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యల అనంతరం రక్తపు మరకలను శుభ్రం చేసి ఆధారాలను చెరిపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మరకలున్న దుస్తులను హరిణి ఉతికి ఆరేసినట్లు గుర్తించారు.

సోమవారం ఉదయం హరిణి పోలీసులకు ఫోన్ చేసి తన భర్త, కుమారుడు స్పృహలో లేరని సమాచారం ఇచ్చింది. పోలీసులు ఇంటికి చేరుకునే సమయానికి ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలపై గాయాలను గుర్తించిన పోలీసులు అనుమానంతో హరిణిని విచారించారు. మొదట సహకరించకపోయినా, అనంతరం జరిగిన విచారణలో వినయ్‌తో తన సంబంధం, హత్య కుట్రకు సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం హరిణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న వినయ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ, ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా తదితరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత హత్యల వెనుక పూర్తి కారణాలు, ఘటనలో ఇద్దరి పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us