AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెజర్ కుక్కర్ రబ్బర్ లూజైందా? రూపాయి ఖర్చు లేకుండా నిమిషాల్లో ఇలా టైట్ చేయండి!

ప్రెజర్ కుక్కర్ నిత్యం వాడటం వల్ల అందులోని రబ్బర్ (గ్యాస్కెట్) లూజై, మూత సరిగ్గా మూతపడక ఆవిరి బయటకు పోతుంటుంది. దీనివల్ల వంట ఆలస్యం అవ్వడమే కాక గ్యాస్ వృథా అవుతుంది. అయితే ప్రతీసారీ కొత్త రబ్బర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఒక సులభమైన హ్యాక్ పాటించవచ్చు. డిజిటల్ క్రియేటర్ దీప్తి కపూర్ ఇన్స్టాగ్రామ్‌లో పంచుకున్న చిట్కా ప్రకారం, లూజైన రబ్బర్‌ను ఎలా సరిచేసుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం..

ప్రెజర్ కుక్కర్ రబ్బర్ లూజైందా? రూపాయి ఖర్చు లేకుండా నిమిషాల్లో ఇలా టైట్ చేయండి!
Pressure Cooker Rubber Hack
Jyothi Gadda
|

Updated on: Aug 18, 2026 | 4:20 PM

Share

ప్రస్తుత కాలంలో ప్రెజర్ కుక్కర్ లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. పప్పు, అన్నం నుంచి కూరలు, స్వీట్ల వరకు ప్రెజర్ కుక్కర్ వల్ల వంట త్వరగా అవ్వడమే కాకుండా గ్యాస్, సమయం రెండూ ఆదా అవుతాయి. అయితే, నిత్యం ఉపయోగించడం వల్ల కుక్కర్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ముఖ్యమైనది కుక్కర్ మూతకు ఉండే గ్యాస్కెట్ లూజ్ అవ్వడం. రబ్బర్ లూజైతే విజిల్ సరిగ్గా రాక, ప్రెజర్ అంతా బయటకు పోయి వంట వండటం కష్టమవుతుంది. ఈ సమస్య ఎదురైన ప్రతిసారీ మార్కెట్‌కు వెళ్లి కొత్త రబ్బర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఒక సింపుల్ చిట్కాతో సమస్యను పరిష్కరించవచ్చు.

వైరల్ అవుతున్న సింపుల్ కిచెన్ హ్యాక్:

ఇటీవల సోషల్ మీడియాలో లూజైన కుక్కర్ గ్యాస్కెట్‌ను సరిచేసే ఒక సులభమైన హ్యాక్ బాగా వైరల్ అవుతోంది. డిజిటల్ క్రియేటర్ దీప్తి కపూర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఉపయోగకరమైన చిట్కాను పంచుకున్నారు. ఈ హ్యాక్ ఎలా చేయాలంటే..

ఇవి కూడా చదవండి

ముందుగా ప్రెజర్ కుక్కర్ మూత నుండి లూజైన రబ్బర్‌ను వేరు చేయండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ రబ్బర్‌ను కొద్దిసేపు నీటిలో ముంచండి. అనంతరం ఒక ప్లేట్‌లో కొంత గోధుమపిండిని తీసుకోండి. నీటి నుండి తీసిన రబ్బర్‌కు రెండు వైపులా గోధుమపిండి తేలికగా అంటుకునేలా పొర్లించండి. ఇప్పుడు ఆ రబ్బర్‌ను తిరిగి కుక్కర్ మూతకు తొడగండి. ఈ చిన్న చిట్కా పాటించడం వల్ల లూజైన రబ్బర్ మూతకు గట్టిగా పట్టుకుని సరిగ్గా ఫిట్ అవుతుంది. దీనివల్ల ప్రెజర్ బయటకు పోకుండా మూత సరిగ్గా లాక్ అవుతుంది. పైగా దీనికోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు.

ఈ వీడియో నెటిజన్లకు ఎంతగానో నచ్చింది. కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తూ నీటిలో ముంచకుండా నేరుగా పిండి రుద్దినా కూడా ఫలితం ఉంటుందని పేర్కొనగా, మరికొందరు లూజైన రబ్బర్‌ను ఓ 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లోని ఫ్రీజర్‌లో ఉంచినా కూడా అది టైట్ అవుతుందని తమ అనుభవాలను పంచుకున్నారు.

ప్రెజర్ కుక్కర్ రబ్బర్ అనేది భద్రతతో కూడుకున్న విషయం. ఒకవేళ రబ్బర్ చాలా పాతబడిపోయి, గట్టిపడినా లేదా తెగిపోయి ఉన్నా ఈ చిట్కాలపై ఆధారపడటం మంచిది కాదు. అటువంటి సమయంలో కొత్త గ్యాస్కెట్ కొనడమే సురక్షితమైన పద్ధతి. కుక్కర్ వాడే ముందు రబ్బర్ సరిగ్గా అమరిందో లేదో సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us