లవర్‌తో కలిసి భర్తను హత్య చేస్తుండగా నిద్రలేచిన కుమారుడు.. తల్లి ఏం చేసిందంటే?
పరాయి వ్యక్తుల మోజులో పడి కట్టుకున్న భాగస్వాములనే మట్టుపెడుతున్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడన్న నెపంతో ఓ ఇల్లాలు ప్రియుడితో కలిసి ఏకంగా భర్త, కొడుకును అతి దారుణంగా హత్య చేసింది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నిండునూరేళ్లు కలిసి నడుస్తానని.. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసింది. కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని కాలుతొక్కి ప్రమాణం చేసింది. మరణం దరిచేరేవరకు నీతోనే ఉంటానని మెడలో మూడుముళ్లు వేయించుకుంది. కట్‌చేస్తే చివరకు ఆమె అతని మెడకు ఉరితాడుగా మారింది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్త, కొడుకును అతి కిరాతకంగా హత్య చేసింది. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో అభినందన్ అనే వ్యక్తి తన భార్య హరిణి, నాలుగేళ్ల కుమారుడు యదువీర్‌తో కలిసి నివసిస్తున్నాడు. అయితే హరిణి గత కొన్నాళ్లుగా వినయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన హరిణి, ప్రియుడు వినయ్‌తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఇటీవల ఒక రోజు రాత్రి ఇంట్లోని సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన హరిణి.. ప్రియుడు వినయ్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో ఇంటికి చేరుకున్న వినయ్‌తో కలిసి నిద్రిస్తున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది.
నిద్రలేచిన కొడుకును సైతం హత్య
అయితే హత్య చేసిన సమయంలో తమ నాలుగేళ్ల కుమారుడు యదువీర్ నిద్రలేవడంతో.. దీని గురించి ఎవరికైనా చెబుతాడోనని కొడుకనే కనీస కనికరం లేకుండా నాలుగేళ్ల చిన్నారిని సైతం దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం అక్కడ పడిన రక్తపు మరకలను మొత్తం క్లీన్ చేసి.. ఆ బట్టలను ఉతికి ఆరేసింది. అనంతరం ప్రియుడు వినయ్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దర్యాప్తులో వెలుగులోకి అసలు ట్విస్ట్
అభినందన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎందుకో భార్య ప్రవర్తన, ఆమె తీరుపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన రీతిలో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె, ప్రియుడు వినయ్‌లపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వినయ్ కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
