
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఓవైపు రాజకీయ నేతల మాటల తూటాలు.. మరోవైపు, పార్టీల మేనిఫెస్టోలు.. ఇలా అన్నీ కూడా కన్నడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఊవ్విళ్లూరుతుండగా.. చెక్ పెట్టాలని కాంగ్రెస్.. సత్తా చాటాలని జేడీఎస్ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు మూడు గ్యాస్ సిలిండర్లు, రోజూ అరలీటర్ నందిని పాలు.. ఇలా ఎన్నో హామీలను బీజేపీ మేనిఫెస్టోలో వివరించింది. అయితే, బీజేపీ మేనిఫెస్టోకి ధీటుగా కాంగ్రెస్ కూడా మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. భారీ తాయిలాలతో కర్ణాటకలో ఓటర్లకు కాంగ్రెస్ గాలం వేసింది. దీంతోపాటు బీజేపీ ఆమోదించిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.
కర్నాటకలో అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో చెమటోడుస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఓటర్లకు గాలం వేయడానికి భారీ హామీలు గుప్పించింది. అనేక హామీలు.. ఉచితాలను ప్రస్తావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ‘సర్వ జనాంగద శాంతియ తోట’ (అన్ని వర్గాల శాంతియుత తోట) పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్, కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేత సిద్ధరామయ్య సమక్షంలో విడుదల చేశారు.
Vision for New #Karnataka unveiled !
Rebuild Brand Karnataka !
Restore Kannada Pride !
Rejuvenate Investment & Innovation !
Recreate Jobs & Employment !
Revive Agricultural Growth !
Resolve to fight Price Rise !
Rescind Hate & Division !THE CONGRESS MANIFESTO !
THE PATHWAY OF… pic.twitter.com/dzEAh1Ke1A
— Randeep Singh Surjewala (@rssurjewala) May 2, 2023
కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పేరుతో 5 ప్రధాన హామీలను పేర్కొన్నారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి గృహిణికి నెలకు రూ.2 వేలు క్యాష్, 10 కిలోల బియ్యం, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, భృతి కింద ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు, డిప్లొమా చేసినవారికి భృతిగా రూ.1500 ఇలా ఎన్నో హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలో ఈ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ఖర్గే చెప్పారు.
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా.. 13న ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..