మరోసారి కులగణన..! అధిష్టానం ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కులగణన చేపట్టాలని నిర్ణయించింది. సిద్దరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయంతో వివాదంలో చిక్కుకుంది. గత కులగణన నివేదికపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. లింగాయత్, వక్కలిగ కులాలతో పాటు రాజకీయ, మేధోవర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కులగణన మరోసారి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించినట్టు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం శివకుమార్ హుటుహుటిన సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీతో ఇద్దరు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కులగణనపై చర్చించారు. గతంలో చేసిన కులగణనపై కర్ణాటకలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి.
లింగాయత్ సంఘాలతో పాటు వొక్కలిగ కులసంఘాలు కూడా కులగణనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. డీకే శివకుమార్ కూడా గతంలో కులగణనను వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి. కుల గణన అంశంపై సమీక్ష జరిపేందుకు గురువారం కర్ణాటక కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కర్ణాటకలో 2015 లోనే అప్పటి ప్రభుత్వం కుల గణన జరిపింది. హెచ్ కాంతారాజ్ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ ఈ సర్వేను నిర్వహించింది. ఆ సమయంలో కోటి 35 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 51 ప్రమాణాల ఆధారంగా 5.98 కోట్ల మంది డాటాను సేకరించారు.
అయితే.. రాజకీయపరమైన కారణాలు, ఇతర కారణాల దృష్ట్యా ఆ నివేదికను సీల్డ్ కవర్‌లోనే ఉంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేబినెట్ ముందుకు ఆ నివేదిక వచ్చింది. అయితే ఆ నివేదికలోని ఓబీసీ రిజర్వేషన్లను 51 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో లింగాయత్, వక్కలింగ కులాలు ఈ నివేదికను తోసిపుచ్చుతున్నాయి. మరోవైపు.. మళ్లీ కుల గణన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటు రాజకీయ వర్గాలు, అటు మేధో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా టీచర్లను సర్వేలో భాగం చేయడం వల్ల అకడమిక్ ఇయర్‌కు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి