AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌‌లో ఎన్నికలకు మార్గం సుగమం.. ముగిసిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ

Jammu Kashmir Delimitation: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గం మరింత సుగమం అయ్యింది. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యింది.

జమ్ముకశ్మీర్‌‌లో ఎన్నికలకు మార్గం సుగమం.. ముగిసిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ
Jammu Kashmir Delimitation CommissionImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: May 05, 2022 | 7:22 PM

Share

Jammu and Kashmir: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గం మరింత సుగమం అయ్యింది. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యింది. ఢిల్లీలో గురువారం జరిగిన సమావేశంలో జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన తుది నివేదికపై డిలిమిటేషన్ కమిషన్ సభ్యులు సంతకాలు చేశారు. ఇప్పటి వరకు అక్కడ 83 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. పునర్విభజన తర్వాత ఈ సంఖ్యను 90కి పెంచారు. వీటిలో 43 స్థానాలు జమ్మూ ప్రాంతంలోనూ.. 47 స్థానాలు కశ్మీర్ ప్రాంతంలోనూ ఉంటాయి. అదనంగా చేర్చిన నియోజకవర్గాల్లో ఆరు జమ్మూ ప్రాంతంలోనూ.. ఒకటి కశ్మీర్ ప్రాంతంలోనే ఉంది. అలాగే తొలిసారిగా ఎస్టీలకు 9 స్థానాలు రిజర్వ్ చేశారు. డీలిమిటేషన్‌లో భాగంగా రెండు స్థానాలను కశ్మీర్ పండిట్స్‌కు రిజర్వ్ చేశారు. ఇందులో ఒక స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేశారు.

అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 24 శాసనసభ నియోజకవర్గాలను యధాతథంగా ఖాళీగా ఉంచుతూ డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లోనూ ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 18 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. చివరగా 1995లో జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరగ్గా.. అప్పట్లో దీనికి ఏడేళ్ల పాటు డీలిమిటేషన్ కమిషన్ పనిచేసింది. ఈ సారి రెండేళ్ల వ్యవధిలోనే నియోజకవర్గ పునర్విబజన ప్రక్రియను కమిషన్ పూర్తి చేయడం విశేషం. డీలిమిటేషన్ కమిషన్‌ 2020లో ఏర్పాటు చేయగా.. దీని కాల వ్యవధిని గత ఏడాది మరో ఏడాది పాటు పొడగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో మరో రెండు నెలల దీని కాల వ్యవధిని పొడగించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్ముకశ్మీర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరించారు.

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి.. త్వరలోనే అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హామీ ఇవ్వడం తెలిసిందే. నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ పూర్తికావడంతో ఈ ఏడాది చివరికల్లా అక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని స్థానిక పార్టీల నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు.

Also Read..

Health Tips: ఈ పండ్లను తొక్కతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది.. అవెంటో తెలుసా..

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి ఆ నగరానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..