లక్నో, మార్చి 10: ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అజయ్ పాల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం..
గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్‌పూర్-అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ కూడలి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీ కొట్టింది. బీహార్‌లోని సీతామర్హి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు జౌన్‌పూర్ నుంచి కెరకట్ వైపు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లోని సీతామర్హికి చెందిన గజధర్ శర్మ తన కుమారుడు చందన్‌శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. ఆయన కారు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో కారు సగానికిపైగా ట్రాక్కు కిందికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కుటుంబ సభ్యులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు వారణాసిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
VIDEO | Six killed, three injured as car collides with truck in Uttar Pradesh’s Jaunpur. More details are awaited. pic.twitter.com/rCkvBNkOE3
— Press Trust of India (@PTI_News) March 10, 2024
ఘటన అనంతరం లారీ డ్రైవర్, సహాయకుడు ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ధ్వంసమైన కారు, లారీని క్రేన్, జేసీబీల సాయంతో పోలీసులు తొలగించారు. మృతులను బీహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన గజ్ధర్ శర్మ (60), అతని కుమారుడు అనిష్ శర్మ (35), జవహర్ శర్మ (57), అతని కుమారుడు సోనమ్ (34), రింకు (32)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.