AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LoC వద్ద మరో పాక్ జాతీయుడు అరెస్ట్.. వారంలో రెండో వ్యక్తి.. వరుస ఘటనలతో భద్రతా దళాల అలర్ట్!

జమ్మూ కాశ్మీర్, పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (LoC) సమీపంలో మరో పాకిస్తానీ జాతీయుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టైన వ్యక్తిని హవేలీ జిల్లాకు చెందిన 31 ఏళ్ల రయీస్ ఖాన్‌గా గుర్తించారు. అతడు మహమ్మద్ యాకూబ్ ఖాన్ కుమారుడని అధికారులు తెలిపారు. ఆదివారం (జూన్ 28) బాలాకోట్ సెక్టార్‌లోకి ప్రవేశించిన అనంతరం విధుల్లో ఉన్న సైనికులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

LoC వద్ద మరో పాక్ జాతీయుడు అరెస్ట్.. వారంలో రెండో వ్యక్తి.. వరుస ఘటనలతో భద్రతా దళాల అలర్ట్!
Pakistan Citizen Arrested
Balaraju Goud
|

Updated on: Jun 29, 2026 | 11:31 AM

Share

జమ్మూ కాశ్మీర్, పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (LoC) సమీపంలో మరో పాకిస్తానీ జాతీయుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టైన వ్యక్తిని హవేలీ జిల్లాకు చెందిన 31 ఏళ్ల రయీస్ ఖాన్‌గా గుర్తించారు. అతడు మహమ్మద్ యాకూబ్ ఖాన్ కుమారుడని అధికారులు తెలిపారు. ఆదివారం (జూన్ 28) బాలాకోట్ సెక్టార్‌లోకి ప్రవేశించిన అనంతరం విధుల్లో ఉన్న సైనికులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక తనిఖీల్లో అతని వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, నేర కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రమాదవశాత్తు సరిహద్దు దాటాడా, లేక ఉద్దేశపూర్వకంగానే భారత భూభాగంలోకి ప్రవేశించాడా అనే అంశంపై భద్రతా, నిఘా సంస్థలు సంయుక్తంగా విచారణ చేపట్టాయి. అతని ప్రయాణ ఉద్దేశ్యం, నేపథ్యం, ఇతర వ్యక్తులతో సంబంధాలు వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ వారంలో పూంచ్ జిల్లాలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది. శుక్రవారం (జూన్ 26) కృష్ణ ఘాటి సెక్టార్లోని గుల్పూర్ ప్రాంతంలో 26 ఏళ్ల మహమ్మద్ సజ్జాద్ అనే మరో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన వ్యక్తిని సైనికులు అదుపులోకి తీసుకుని అనంతరం పోలీసులకు అప్పగించారు. అంతకుముందు జూన్ 9న జావేద్ అలీ అనే 14 ఏళ్ల బాలుడిని కూడా నియంత్రణ రేఖ దాటిన సందర్భంగా అదుపులోకి తీసుకోగా, విచారణ అనంతరం వారం రోజుల తర్వాత అతడిని తిరిగి పాకిస్థాన్‌కు అప్పగించారు.

వరుసగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. బాలాకోట్, గుల్పూర్ ప్రాంతాల్లో తరచుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన వ్యక్తులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమికంగా వీరు దారితప్పి సరిహద్దు దాటిన అవకాశాలను పరిశీలిస్తున్నప్పటికీ, గూఢచర్యం, సరిహద్దు భద్రతను పరీక్షించే ప్రయత్నాలు, ఇతర కుట్రల కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కారణంగానే ఇలాంటి చొరబాటు ప్రయత్నాలను వెంటనే గుర్తించి అడ్డుకోవడం సాధ్యమవుతోందని, దీంతో భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా నివారించగలుగుతున్నామని ఒక సీనియర్ భద్రతా అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us