Jammu & Kasmir: 2022లో తీవ్రవాదుల దాడుల్లో 29 మంది మృతి.. వీరిలో కశ్మీర్ పండిట్లు ఎందరంటే?

|

Dec 31, 2022 | 4:54 PM

Jammu & Kasmir: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రవాద కార్యక్రమాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం, ఆర్మీ తీసుకుంటున్న కట్టుదిట్టమైన భద్రతా చర్యల కారణంగా..

Jammu & Kasmir: 2022లో తీవ్రవాదుల దాడుల్లో 29 మంది మృతి.. వీరిలో కశ్మీర్ పండిట్లు ఎందరంటే?
Jammu And Kashmir
Follow us on

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రవాద కార్యక్రమాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం, ఆర్మీ తీసుకుంటున్న కట్టుదిట్టమైన భద్రతా చర్యల కారణంగా.. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో 2022 సంవత్సరంలో హింస చాలా వరకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో 172 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. ఉగ్రవాదుల దాడుల్లో 29 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో ఆరుగురు హిందువులు, 15 మంది ముస్లింలు సహా 21 మంది స్థానికులు చనిపోయారని భద్రతా సిబ్బంది ప్రకటించారు.

కశ్మీర్ ఏడీపీపీ మీడియాతో మాట్లాడుతూ.. 2022లో కశ్మీర్‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగాయని, ఇందులో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా 172 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టడం జరిగిందన్నారు. ఎక్కువగా ఎల్‌ఈటీ, టీఆర్ఎస్ గ్రూపులకు చెందిన 108 మందిని అంతమొందించడం జరిగిందని తెలిపారు. జేఈఎం 35, హెచ్ఎం 22, అల్ బదర్ 4, ఏజీయూహెచ్ 3 హతమయ్యారు. ఇక ఈ సంవత్సరం తీవ్రవాదుల రిక్రూట్‌మెంట్ భారీగా తగ్గిందన్నారు. దాదాపు 100 మంది రిక్రూట్ అయ్యారని, గతేడాది కంటే 37 శాతం తక్కువ అని అన్నారు ఏడీజీపీ. వీరిలోనూ ఎక్కువగా 74 మంది ఎల్‌ఈటీలో చేరారని వివరించారు. అయితే, ఈ మొత్తం రిక్రూట్‌మెంట్‌లో 65 మంది ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారని, 17 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం జరిగిందని, 18 మంది ఇంకా క్రియాశీలంగా ఉన్నట్లు వెల్లడించారు ఏడీజీపీ.

ఇవి కూడా చదవండి

ఇక కొత్తగా రిక్రూట్ అయిన వారిలో దాదాపు 89 శాతం మంది చేరిన నెల రోజుల్లోనే హతమయ్యారని వివరించారు ఏడీజీపీ. ఈ సంవత్సరం ఎన్‌కౌంటర్లు, మాడ్యూల్స్ బస్టింగ్ సమయాల్లో భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 121 ఏకే సిరీస్ రైఫిల్స్, 8 ఎం4 కార్బైన్, 231 పిస్టల్స్ ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఐఈడీలు, బాంబులు, గ్రెనేడ్స్‌ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇలా పటిష్టమైన భద్రతా చర్యల కారణంగా 2022లో ఉగ్రవాద కార్యకలాపాలను పెత్త ఎత్తున కట్టడి చేయడం జరిగిందన్నారు.

21 మంది మృతి..

ఈ ఏడాది విషాదం కూడా నింపింది. 2022లో 21 మంది స్థానికులు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు హిందువులు(వీరిలోనూ ముగ్గురు కశ్మీర్ పండిట్లు), 15 మంది ముస్లింలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 8 మంది సహా మొత్తం 29 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2022లో 14 మంది జమ్మూ కశ్మీర్ పోలీసులు సహా మొత్తం 26 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్ సమయంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారని ఏడీజీపీ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..