నెల్లూరు, డిసెంబర్ 13: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2024 వ సంవత్సరానికి భారీ టార్గెట్‌నే ఎంచుకుంది. ఇప్పటికే చంద్రయాన్‌తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఇస్రో శాస్త్ర వేత్తలు 2024 లో కీలక ప్రయోగాలకు ఏర్పాట్లు చేపట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది భారీ ప్రయోగాలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. రానున్న ఏడాది కి సంబంధించి ఇస్రో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలు ఇప్పటికే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పార్లమెంట్‌లో అధికారికంగా వెల్లడించారు. దీంతో మరో సారి అందరి చూపు ఇస్రో వైపు చూసేలా చేసింది.2024 లో ఇస్రో చేపట్టనున్న పది ప్రయోగాలపై ఇస్రో శాస్త్ర వేత్తల నుంచి కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది.
ఇస్రో చేపట్టనున్న పది ప్రయోగాల్లో ఆరు PSLV కాగా, మరో మూడు GSLV, GSLV మార్క్ 3 ప్రయోగం నాసా ఇస్రో కలిసి సంయుక్తంగా మిషన్ చేపట్టనున్నారు. 2023లో చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్ల విజయాల తర్వాత 2024లో స్వదేశీ రాకెట్లతో 13 ప్రయోగాలతో సహా 16 ప్రధాన అంతరిక్ష ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌లో ఇస్రో కొత్త ప్రాజెక్టుల వివరాలు తెలిపారు. LVM3 ద్వారా కమర్షియల్ లాంచ్ చేపట్టనుంది. ఈ ప్రయోగంతో పాటు PSLV ప్రయోగాల ద్వారా 60 కి పైగా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను స్పేస్ లోకి పంపనుంది ఇస్రో. అలాగే SSLV డెవలప్మెంట్ లాంచ్ కూడా జరగనుంది. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్రో సొంతంగా రూపొందించిన చిన్న తరహా రాకెట్. అది అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో జరిపే అవకాశం ఉన్న వాహక నౌక. కమర్షియల్ గా మరిన్ని ప్రయోగాలకు ఇది దోహదం చేస్తుంది. ఇప్పటికే రెండు టెస్ట్ లాంచ్ లు చేపట్టగా మరింత సాంకేతికతో మరోసారి 2024లో SSLV డెవలప్మెంట్‌లాంచ్ జరగనుంది. ఇవి అంతిమంగా తక్కువ-భూ కక్ష్య ఉపగ్రహ ప్రయోగాల కోసం ప్రైవేట్ సెక్టార్ ద్వారా ఈ తరహా రాకెట్ ప్రయోగాలను జరపాలని ఇస్రో యోచిస్తోంది.
గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద రెండుమానవరహిత మిషన్లు మానవ-రేటెడ్ లాంచ్ వెహికల్‌ను ప్రయోగించనుంది. 2025లో పూర్తి స్థాయి ప్రయోగం జరగనుంది. వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ భద్రత కోసం ప్రయోగాత్మక ప్రయోగాలను 2024లో పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2025 ఏడాదిలో భారత్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఇది కీలకంగా మారనుంది. గగన్ యాన్ మిషన్ కి సంబంధించి వ్యోమగాములు శిక్షణ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో శాస్త్ర వేత్తలు ఇప్పటికే ప్రకటించారు.2025 లో జరిగే ప్రయోగం కోసం అన్ని విధాలా సిద్ధం అయ్యేందుకు 2024 కీలకం. గగన్‌యాన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను వివిధ అబార్ట్ పరిస్థితులలో ఉపయోగించేందుకు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అలాగే వాతావరణ అధ్యయనం కోసం శాటిలైట్, నావిగేషన్ శాటిలైట్ అలాగే నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు.
అదేవిధంగా న్యూ స్పేస్ ఇండియా ఆధ్వర్యంలో LVM3 కమర్షియల్ మిషన్ ప్రయోగం కూడా ఉంటుంది. అయితే ఇందులో ఆరు PSLV మిషన్లలో వివిధ ఉపగ్రహాలు మరియు భూ పరిశీలన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి రెండు మిషన్లు, రెండు సాంకేతిక , మరియు రెండు కమర్షియల్ ప్రయోగాలు ఉన్నాయి. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ తో ప్రపంచ దేశాల దృష్టిని భారత్ ఆకర్షించింది. చంద్రయాన్ 3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ ను విజయవంతం చేసిన ఇస్రో చంద్రయాన్ 4 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ తోపాటు తిరిగి భూమి మీదకు అక్కడి నుంచి మట్టి, రాళ్ళ నమూనాలను తీసుకొచ్చే అత్యంత క్లిష్టమయిన ప్రయోగం చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. దీనికి సంబందించిన ఏర్పాట్లు 2024 లోనే మొదలు కానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.