ISKCON సంస్థపై ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు.. స్పందించిన ఇస్కాన్

ఇస్కాన్‌ సంస్థపై బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సంస్థ గోవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ ఆమె ఆరోపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో అతిపెద్ద మోసపూరితమైన సంస్థ ఇస్కాన్‌గా ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సంస్థకు దేశంలో అనేక గోశాలలు ఉన్నాయని గుర్తు చేస్తూ..

ISKCON సంస్థపై ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు.. స్పందించిన ఇస్కాన్
Cows

Updated on: Sep 27, 2023 | 4:22 PM

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్‌) సంస్థపై బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త  మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సంస్థ గోవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ ఆమె ఆరోపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో అతిపెద్ద మోసపూరితమైన సంస్థ ఇస్కాన్‌గా ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సంస్థకు దేశంలో అనేక గోశాలలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. వాటి నిర్వహణ కోసం ఆ సంస్థ ప్రభుత్వాల నుండి చాలా ప్రయోజనాలను పొందుతోందని చెప్పారు. గోశాలల నిర్వహణ కోసం ప్రభుత్వాల నుంచి భూములు, ఇతర వసతులను ఇస్కాన్ సంస్థ పొందుతోందని చెప్పారు. అయితే ఇటీవల తాను అనంతపూర్ గోశాలకు వెళ్లి చూడగా అక్కడ పాలు ఇవ్వని ఒక్క గోవు కూడా లేదన్నారు. అలాగే అక్కడ  లేగ దూడ కూడా అక్కడ కనిపించలేదన్నారు. అక్కడనున్న గోవులన్నిటినీ కసాయిలకు అమ్మేశారని ఆరోపించారు. తమ జీవితమంతా పాలపైనే ఆధారపడి ఉందని చెబుతారని.. అయితే బహుశా ఇన్ని పశువులను కసాయిలకు ఎవరూ విక్రయించి ఉండరని ఆరోపించారు. ఇస్కాన్ సంస్థ ఇలా చేస్తే.. ఇతరుల సంగతేంటని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మేనకా గాంధీ వీడియో..

నిరాధార ఆరోపణలు: ఇస్కాన్

అయితే మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ సంస్థ తోసిపుచ్చింది. బీజేపీ ఎంపీ ఆరోపణలు నిరాధారం, అవాస్తవమని స్పష్టంచేసింది. ఆవులు, ఎద్దులను వాటి జీవితాంతం వరకు పోషిస్తున్నట్లు తెలిపింది. తమ గోశాలలో పాలు ఇవ్వని ఆవులను కసాయిలకు అప్పగిస్తున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టంచేశారు. ఆమె అనంతపూర్ గోశాలను సందర్శించినట్లు వీడియోలో చెప్పినప్పటికీ.. ఆమె గోశాలను సందర్శించినట్లు అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరూ ధృవీకరించలేదని తెలిపింది. పాలు ఇవ్వని ఆవులు, ఎద్దులను సంరక్షిస్తున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

ఇస్కాన్ ప్రతినిధి షేర్ చేసిన వీడియో

మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ జంతు హక్కుల కార్యకర్తగా గుర్తింపు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత, కృష్ణ తత్వంపై ఇస్కాన్ సంస్థ ప్రచారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్‌కు 1000కి పైగా ఆలయాలు ఉన్నాయి.  వేలాది గోశాలలను కూడా నిర్వహిస్తోంది.  తాజాగాఇస్కాన్ సంస్థపై మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఇస్కాన్ భక్తులు దిగ్ర్భాంతి వ్యక్తంచేస్తున్నారు. అటు మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.