Indian Railways: రోజూ వచ్చిపోయే రైళ్లను లెక్కించడమే వారి ఉద్యోగం.. నెల తరువాత జీతం కోసం వెళితే ‘బిగ్ ట్విస్ట్’..
అబ్బా.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని మురిసిపోయారు వారంతా. పెద్దగా పని కూడా లేదు. రైల్వే స్టేషన్‌లో కూర్చుని.. కేవలం వచ్చి పోయే రైళ్లు సంఖ్య, ఆ రైళ్లకు ఉన్న బోగీల సంఖ్యను లెక్కించడమే ఉద్యోగం.
అబ్బా.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని మురిసిపోయారు వారంతా. పెద్దగా పని కూడా లేదు. రైల్వే స్టేషన్‌లో కూర్చుని.. కేవలం వచ్చి పోయే రైళ్లు సంఖ్య, ఆ రైళ్లకు ఉన్న బోగీల సంఖ్యను లెక్కించడమే ఉద్యోగం. నెలకు మంచి జీతం. ఇంకేముంది లైఫ్ సెట్ అనుకున్నారు వారంతా. కానీ, నెల తరువాత జీతం కోసం చూస్తే.. ఎంతకీ అకౌంట్లో పడటం లేదు. దాంతో అమాయక రత్నాలు నేరుగా రైల్వే స్టేషన్ అధికారులను సంప్రదించారు. వారు చెప్పిన విషయం విని గుడ్లు తేలేశారు. అప్పుడు గానీ జ్ఞానోదయం అవలేదు వారికి. ఉద్యోగం పేరుతో 28 మందిన ముంచేశారు కేటుగాళ్లు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడుకు చెందిన 28 మంది వ్యక్తులు దేశ రాజధాని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చి పోయే రైళ్లు, వాటి కోచ్‌లను దాదాపు ఒక నెల రోజులపాటు లెక్కిస్తున్నారు. అదేమంటే.. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లు(టీటీఈలు), ట్రాపిక్ అసిస్టెంట్లు, క్లర్క్ ఉద్యోగుల శిక్షణలో భాగంగా ఈ పని చేయాలట. ఇది కేటుగాళ్లు, ఆ అమాయకుల చెప్పిన మాటలు. ఈ పని చేసేందుకు మాయగాళ్లు ఒక్కొక్కరి నుంచి రూ. 2 నుంచి 24 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
స్కామ్‌లో బలైన 28 మంది.. ఇలా వెలుగులోకి..
78 ఎళ్ల మాజీ సైనికోద్యోగి సుబ్బు సామి ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు ప్రకారం.. జూన్, జులై మధ్య కొందరు కేటుగాళ్లు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఒక నెల శిక్షణ అంటూ.. వారిని ఢిల్లీకి పంపించి.. రైల్వే స్టేషన్‌లో వచ్చే, పోయే రైళ్లను లెక్కించే టాస్క్ ఇచ్చారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసగాడు రాణా తనను తానా ఢిల్లీలోని నార్త్ రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. బ్యాక్ డోర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, అందుకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందని నమ్మించాడు. అది నమ్మిన బాధితులు.. సుబ్బుసామి మధ్యవర్తిగా కేటుగాడికి డబ్బులు చెల్లించారు. బాధితుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్, ఐటీ విద్యనభ్యసించిన వారే ఉన్నారు.
కాగా, ఈ మొత్తం వ్యవహారంలో కేటుగాళ్లైన రాణా, శివరామన్ లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు చెప్పే మాయమాటలకు పడిపోవద్దని, డబ్బులు కోల్పోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..