Indian Railways: నవ శకానికి ఇండియన్ రైల్వేస్ మరో అడుగు దూరం..
భారతీయ రైల్వేలు ఈ ఏడాది జూలై చివరి నాటికి 99 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. 69,800 కిలోమీటర్ల రైలు మార్గాలలో కేవలం 698 కిలోమీటర్ల మార్గం మాత్రమే విద్యుదీకరణ చేయాల్సి ఉంది. 2026 మార్చి నాటికి 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని ముందుగానే పూర్తి చేస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న ఇండియన్ రైల్వేస్.. మరో అరుదైన చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉంది. వేల రైళ్లు, ఎన్నో ట్రాకులు, మరెన్నో స్టేషన్లు, లక్షల్లో ఉద్యోగులు.. అత్యధిక జనాభా కలిగిన దేశానికి వన్నె తెచ్చే విధంగా అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ మన సొంతం. అలాంటి అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను పూర్తిగా విద్యుదీకరణ చేయడానికి భారతీయ రైల్వే కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే 99 శాతం పనులు పూర్తి కాగా.. జస్ట్ ఒక్క శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అది కూడా చేసేస్తే.. వంద శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి అవుతుంది.
ఈ ఏడాది జూలై చివరి నాటికే రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ 99 శాతానికి చేరుకుందని, 69,800 కిలోమీటర్లలో 698 కిలో మీటర్ల రూట్ మాత్రమే విద్యుదీకరణ చేయాల్సి ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మార్చి 2026 గడువు కంటే చాలా ముందుగానే జాతీయ రవాణా 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ డేటా ప్రకారం 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రైల్వే నెట్‌వర్క్‌లో 100 శాతం విద్యుదీకరణను సాధించగా, మరో ఐదు – అస్సాం, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గోవా – 90 శాతం కంటే ఎక్కువ విద్యుదీకరణను పనులు పూర్తి చేశాయి. వీటిలో అస్సాం గరిష్టంగా 269 కిలో మీటర్ల రూట్‌ను విద్యుదీకరణను పూర్తి చేయాల్సి ఉంది. తరువాత తమిళనాడు (169 కి.మీ), కర్ణాటక (151 కి.మీ) ఉన్నాయి. రాజస్థాన్ విషయంలో ఇంకా 1 శాతం ట్రాక్‌లు మాత్రమే విద్యుదీకరణ జరగలేదు. వంద శాతం సాధించడానికి తాము సౌర విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




