Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATV: సరిహద్దు గస్తీలో భారత ఆర్మీ కీలక ముందడుగు.. ఇక శత్రు దేశాలకు దబిడి దిబిడే..!

దేశ సరిహద్దుల్లో భారత సేనల గస్తీ మరింత బలోపేతం కానుంది. కొండలు, లోయలు, వాగులు, వంకలు, మంచుతో కప్పేసిన నేలలు.. ఇలాంటి విభిన్న భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాల్లో అన్ని వాహనాలు నడపలేం. అందుకే భారత ఆర్మీ అధునాతన "ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ (ATVs)"ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏటీవీ అంటే ఏంటి? దాని ప్రత్యేకతలేంటి? తెలుసుకుందాం...

ATV: సరిహద్దు గస్తీలో భారత ఆర్మీ కీలక ముందడుగు.. ఇక శత్రు దేశాలకు దబిడి దిబిడే..!
ATV
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 12, 2025 | 5:09 PM

రోడ్డుపై గుంతలున్నా.. కాస్త ఎగుడుదిగుడుగా ఉన్నా వాహనాలు నడపడం కష్టం. గతుకుల రోడ్డుపై వాహనాలు మొరాయిస్తుంటాయి. అసలు రోడ్డే లేని చోట.. ఇంకా చెప్పాలంటే కొండలు, లోయలు, వాగులు, వంకలు, మంచుతో కప్పేసిన నేలలు.. ఇలాంటి విభిన్న భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాల్లో అన్ని వాహనాలు నడపలేం. అందుకే సరిహద్దుల్లో పహారా కాచే సైన్యం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే కాలి నడకను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి దేశంలో చొరబడాలని ప్రయత్నించే పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇలాంటప్పుడు మన సైన్యాన్ని సాంకేతికంగా మరింత బలోపేతం చేసి, ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో భారత ప్రభుత్వం “ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ (ATVs)”ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏటీవీ అంటే ఏంటి? దాని ప్రత్యేకతలేంటి? తెలుసుకుందాం…

ఆల్ టెర్రయిన్ వెహికిల్ అంటే.. ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా సరే దూసుకెళ్లే వాహనం అని అర్థం. అంటే కొండలు, లోయలు, ఎడారి ఇసుక నేలలు, అడవులు, రాళ్లు రప్పలతో కూడిన వాగులు, మంచుతో కప్పేసిన మార్గాలు.. ఇలా ఎక్కడైనా సరే ఆ వాహనంలో ప్రయాణం చేయవచ్చు. ఇవి సరిహద్దులను కాపుకాసే సైన్యానికి చాలా అవసరం. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో “లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC)”, టిబెట్ (చైనా) సరిహద్దుల్లోని “లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)” వద్ద వీటి అవసరం ఎక్కువగా ఉంది. పూర్తిగా సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో LoC, LAC ఉన్నాయి. ఇక్కడ కాపలా కాయడం అంటే కత్తి మీద సాములాంటి వ్యవహారమే. సరిహద్దుల్లో సైన్యం కాపలాగా ఉండే వాచ్ టవర్ల నుంచి తమ యూనిట్లకు చేరుకోవాలన్నా.. యూనిట్ నుంచి మరో బృందం వాచ్ టవర్ వద్దకు చేరుకోవాలన్నా కాలి నడక సాగించాల్సిందే. ఇలాంటి చోట ఇప్పుడు ATVలను వినియోగించనున్నారు. తద్వారా వేగంగా సైన్యం రవాణా సాధ్యపడుతుంది. ఉగ్రవాదుల చొరబాట్ల సమయంలో వారిని వేటాడి, వెంటాడి పట్టుకోడానికి ఇవి చాలా ఉపయోగకరంగా మారనున్నాయి.

లద్దాఖ్‌లో 3 రకాల ATVలు:

గల్వాన్ సంఘటన తర్వాత టిబెట్ (చైనా) సరిహద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం.. ఇక్కడి సైన్యం కోసం 3 రకాల ఆల్ టెర్రయిన్ వెహికిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలారిస్ స్పోర్ట్స్‌మ్యాన్ విత్ క్యాబ్, పోలారిస్ RZR, JSW-గెక్కో ATOR వంటి ATVలను లడఖ్‌లో మోహరించింది. లద్దాఖ్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన క్లిష్టమైన భౌగోళిక ప్రాంతం. ఇక్కడి అతిశీతల వాతావరణం, మంచుతో పాటు ఎగుడుదిగుడుగా.. హిమాలయ పర్వతాల మధ్య పీఠభూమి, లోయలు, ఎత్తైనా శిఖరాలతో కూడుకుని ఉంటుంది. ఇలాంటి చోట సైన్యం వేగంగా ఒకచోట నుంచి మరో చొటకు కదలాలి అంటే కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని తాజాగా ప్రవేశపెట్టిన ఆల్ టెర్రయిన్ వెహికిళ్లు నివారించగల్గుతాయి.

అధునాతన ఏటీవీ వీడియో..

ఎల్ఓసీలో బలోపేతంకానున్న భారత ఆర్మీ గస్తీ

ఘనీభవించిన యుద్ధభూమిపై దూసుకుపోతున్న ఈ ఆధునిక యంత్రాలు ఈ ప్రాంతంలోని తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యాయి. తక్కువ బరువు కల్గిన ATVలు అధిక చలనశీలతతో కొండ ప్రాంతాల్లో మంచు పలకల మీదుగా దూసుకెళ్లగలవు. తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ లద్ధాఖ్‌లోని డెప్సాంగ్ మైదానాలు, డెమ్‌చోక్ ప్రాంతాలలో విజయవంతంగా పెట్రోలింగ్ నిర్వహించడంలో ఈ వాహనాలు దోహదపడుతున్నాయి.

LoC గస్తీలో ఏటీవీలే ఆయుధాలు

లద్దాఖ్ ప్రాంతంలోనే కాదు.. వీటి అవసరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌, భారత భూభాగంలోని కాశ్మీర్‌ను వేరు చేస్తూ సాగే ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ (LoC) వద్ద గస్తీ కాచే సైన్యానికి ఈ వాహనాల అవసరం ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. ఈ ప్రాంతం భౌగోళికంగా క్లిష్టంగా ఉండడమే కాదు.. సరిహద్దుల అవతల పాకిస్తాన్ సైన్యం చేతిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఏ చిన్న అవకాశం దొరికినా చొరబడేందుకు కాచుకుని ఉంటారు. ప్రతికూల వాతావరణంలో చొరబాట్లకు సైతం పాల్పడుతూ భారత భూభాగంపై ఉగ్రచర్యలకు పాల్పడుతుంటారు. అందుకే ఈ ప్రాంతంలో గస్తీని మరింత పటిష్టం చేయాలన్నా.. ఉగ్రమూకల ఆట కట్టించాలన్నా.. ATVల అవసరం చాలా ఉంది. తాజాగా ఈ ప్రాంతంలో అమెరికాలో తయారు చేసిన ‘పొలారిస్’ ATVలను భారత సైన్యంలో చేర్చారు. ఇక్కడి పర్వతాలు, అడవులు, హిమపాతంతో కూడిన నేలలు, చిత్తడి నేలలు మొదలైన ప్రాంతాల్లో సైన్యం ఈ వాహనాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనుంది. ఈ ATVలో RPM 1200 నుండి 3500 వరకు ఉంటుంది. తద్వారా ఎత్తైన ప్రాంతాలకు సైతం సునాయాసంగా చేరుకోగలవు. ముఖ్యంగా సాధారణ వాహనాలు చేరుకోలేని క్లిష్టమైన ప్రాంతాలలో వీటిని ఉపయోగించనున్నారు.

జమ్ము ప్రాంతంలో సైన్యంలో ప్రవేశపెట్టిన పోలారిస్ ఏటీవీ గురించి టీవీ9 ప్రతినిధి అంకిత్ భట్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్