Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Slams Pak: అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ దుష్ప్రచారం, భారత్ ఖండన. సహించబోమని హెచ్చరిక

భారత్ పై దుష్ప్రచారానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటూ వాటిని దుర్వినియోగం చేస్తోందని ఇండియా ఆరోపించింది. నిరాధారమైన..

India Slams Pak: అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ దుష్ప్రచారం, భారత్ ఖండన. సహించబోమని హెచ్చరిక
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 25, 2021 | 5:32 PM

భారత్ పై దుష్ప్రచారానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటూ వాటిని దుర్వినియోగం చేస్తోందని ఇండియా ఆరోపించింది. నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ప్రచారం చేస్తోందని, మాపై వేలెత్తి చూపే ముందు తన దేశ పరిస్థితిని సజావుగా ఉంచుకోవాలని సలహా ఇచ్చింది. జెనీవాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 46 వ సెషన్ లో హైలెవెల్ సెగ్మెంట్ కింద సమాధానమివ్వడానికి గల హక్కును వినియోగించుకున్న ఇండియా.. పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. ఐరాస వేదికను ఆ దేశం ఇందుకు వినియోగించుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదని జెనీవా లోని భారత శాశ్వత ఉప దౌత్యాధికారి సీమా పూజానీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలు, లడాఖ్ భారత అంతర్భాగాలని, కానీ పాక్ వీటిని తమవిగా చెప్పుకుంటోందని ఆమె అన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు గుడ్ గవర్నెన్స్ ఇవ్వడమన్నది భారత అంతర్గత వ్యవహారమన్నారు. పాక్ లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలు వేధింపులను ఎదుర్కొంటున్నారని, ఆ దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆమె అన్నారు.

పాక్ లోని హిందూ ఆలయాలపై దాడులుజరుగుతున్నాయి.. మైనారిటీలకు చెందిన సుమారు వెయ్యిమందికి పైగా మహిళలను కిడ్నాప్ చేయడమో, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని మత మార్పిడులు చేయించడమో జరుగుతోందని స్వయంగా పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఈ అంశాలను ప్రస్తావించిందని సీమా పూజానీ పేర్కొన్నారు. బెలూచిస్థాన్ లోను, ఇతర రాష్ట్రాల లోను రాజకీయ కక్షలు పెరిగాయని, ప్రభుత్వానికి, ఆర్మీకి ఎదురు చెప్పినవారిని నిర్బంధ శిబిరాలకు తరలిస్తున్నారని, టార్చర్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికీ ఆ దేశంలో మైనారిటీలపై హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుందామని అంటూనే.. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్నాయన్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అది ఇండియాకే కాక ఇతర దేశాలకు కూడా ప్రమాదకరమని ఆమె చెప్పారు. అమెరికన్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ ను హత్య చేసిన అల్ ఖైదా టెర్రరిస్టు ఉమర్ సయీద్ షేక్ ను పాక్ సుప్రీం కోర్టు నిర్దోషిగా విడుదల చేయడం ఇలాంటి ఉగ్రవాద శక్తులతో ఉన్న లింకుకు స్పష్టమైన నిదర్శనమన్నారు. అంతకు ముందు మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. టెర్రరిజం మొత్తంగా మానవాళికే తీవ్రమైన ముప్పుగా  పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన పరోక్షంగా పాకిస్థాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు మార్లు ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తెచ్చ్చినట్టు ఆయన చెప్పారు. తను గతంలో కూడా పాక్ అధికారులతో ఇదే విషయాన్నీ స్పష్టం చేశానన్నారు.

కాగా పాక్ కు టర్కీ వెన్నుదన్నుగా నిలవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ తో బాటు ఈ దేశం కూడా వంత పాడుతోందని పేర్కొంది. కాశ్మీర్ అంశాన్ని టర్కీ సైతం పదేపదే ప్రస్తావించడం పట్ల మండిపడింది. ఈ విషయాన్నీ ఐరాస పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.

Also Read:

బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా..అయితే ఒక్కసారి ఇది చదవండి.. లేకపోతే చాలా సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుంది..

Nirav Modi: నీరవ్ మోదీకి షాక్.. ఆధారాలు రుజువయ్యాయి.. భారత్‌కు అప్పగించండి: యూకే కోర్టు సంచలన తీర్పు