Netflix Controversy: నెట్‌ఫ్లిక్స్‌లో జాతి వివక్ష.. పన్ను ఎగవేత సహా పలు నేరారోపణలపై కేంద్రం దర్యాప్తు

| Edited By: Janardhan Veluru

Sep 23, 2024 | 12:18 PM

Netflix Controversy: నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్, బ్రాడ్‌బ్యాండ్ ఉపయోగించేవారికి నెట్‌ఫ్లిక్స్ (Netflix) గురించి పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వంటి ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ అందించే స్ట్రీమింగ్ కంపెనీ కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఆ సంస్థ భారతదేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు వివాదాస్పదంగా మారాయి.

Netflix Controversy: నెట్‌ఫ్లిక్స్‌లో జాతి వివక్ష.. పన్ను ఎగవేత సహా పలు నేరారోపణలపై కేంద్రం దర్యాప్తు
Netflix
Follow us on

నేటి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్, బ్రాడ్‌బ్యాండ్ ఉపయోగించేవారికి నెట్‌ఫ్లిక్స్ (Netflix) గురించి పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వంటి ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ అందించే స్ట్రీమింగ్ కంపెనీ కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఆ సంస్థ భారతదేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు వివాదాస్పదంగా మారాయి. ఇందులో పన్ను ఎగవేత, వీసా నిబంధనల ఉల్లంఘనతో పాటు జాతి వివక్ష వంటి తీవ్రమైన అంశాలు కూడా ఉన్నాయి. వీటిపై వివరణ కోరుతూ తాజాగా కేంద్ర హోంశాఖ ఆ సంస్థకు రాసిన ఈ-మెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హోంశాఖలోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) విభాగంలో పనిచేసే అధికారి దీపక్ యాదవ్ ఈ లేఖను నెట్‌ఫ్లిక్స్‌కు పంపించారు. భారతదేశంలో నిర్వహిస్తున్న వ్యాపార కార్యాకలాపాల్లో పలురకాల అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు.

నందిని మెహతా ఫిర్యాదుతో వెలుగులోకి..

నెట్‌ఫ్లిక్స్ సంస్థలో 2018 నుంచి 2020 వరకు బిజినెస్ అండ్ లీగల్ అఫైర్స్ డైరెక్టర్‌గా నందిని మెహతా పనిచేశారు. ఈ సంస్థకు చెందిన లాస్ ఏంజెల్స్ (అమెరికా) కార్యాలయంతో పాటు ముంబై కార్యాలయంలో కూడా ఆమె పనిచేశారు. అయితే 2020లో ఆమెను సంస్థ తొలగించింది. తనను అకారణంగా తొలగించడంపై ఆమె లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లో తనపై లింగ వివక్ష, జాతి వివక్ష ప్రదర్శించారని కూడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఖండించడంతో పాటు నందినిపై ప్రత్యారోపణలు చేసింది. కంపెనీ ఇచ్చిన కార్పొరేట్ క్రెడిట్ కార్డును నందిని తన వ్యక్తిగత ఖర్చుల కోసం విచ్ఛలవిడిగా వినియోగించారని, వేల కొద్దీ డాలర్ల దుర్వినియోగం జరిగిందని, అందుకే తాము ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామని ఆ సంస్థ పేర్కొంది. ఈ కేసులో న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానంటూ నందిని ప్రకటించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సోమవారం (నేడు) జరగనుంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతెలా ఉన్నా.. భారత్‌లో నిర్వహించే కార్యకలాపాలు మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్లాయి.

ఏడాది క్రితం నుంచి భారత్‌లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొటున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇప్పుడు నందిని ఆరోపణలతో వీసా నిబంధనల ఉల్లంఘన, జాతి వివక్ష ఆరోపణలు సైతం ఎదుర్కొంటోంది. ప్రస్తుతానికి నేరుగా ఏ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయనప్పటికీ.. హోంశాఖ పంపిన ఈ-మెయిల్‌కు సంస్థ ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు హోంశాఖలోని FRRO విభాగంతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నాయి.