Chandigarh University: పంజాబ్ మొహాలిలోని చండీఘఢ్ యూనివర్సిటీలో విద్యార్ధినుల ఎంఎంఎస్ వీడియోల లీక్‌పై రగడ మరింత రాజుకుంది. యూనివర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్ధులు శనివారం రాత్రి నుంచి భారీ ఆందోళన చేపట్టారు. 60 మంది విద్యార్ధినుల స్నానాల దృశ్యాలను వైరల్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్‌లో బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో రెండు రెండు పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. శనివారం రాత్రి నుంచి ఈ ఘటనపై యూనివర్సిటీ అట్టుడుకుతోంది. వీడియోలు వైరల్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి తన ఫోటోలను, వీడియోను మాత్రమే బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ఆ విద్యార్ధిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకోవడానికి సిమ్లాకు వెళ్లారు.
కాగా.. హాస్టల్ బాలికల డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయన్న వాదనలను యూనివర్సిటీ ఆదివారం ఖండించింది. కేవలం ఒక విద్యార్థి తన వీడియోను మాత్రమే షేర్ చేసిందని పేర్కొంది. ఛాన్సలర్ డాక్టర్ ఆర్.ఎస్.బావా మాట్లాడుతూ.. విద్యార్థులకు సంబంధించిన 60 అభ్యంతరకరమైన MMS వీడియోలు దొరికినట్లు మీడియా ద్వారా వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని.. నిరాధారమని పేర్కొన్నారు. ఏ వీడియోలు కూడా షేర్ చేయలేదని.. తన బాయ్‌ఫ్రెండ్‌కు ఆమె వ్యక్తిగత వీడియో మాత్రమే షేర్ చేసిందన్నారు. అయితే.. దర్యాప్తులో, నిందితురాలికి సంబంధించిన ఒక వీడియో మాత్రమే కనుగొన్నట్లు మొహాలీ పోలీసు చీఫ్ వివేక్ సోనీ చెప్పారు.యూనివర్సిటీలో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపుతున్నామని తెలిపారు.
విద్యార్థినుల వీడియోల వైరల్ ఘటన అనంతరం యూనివర్సిటీలో పలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. యూనివర్సిటీలో ఎవరు కూడా సూసైడ్ చేసుకోలేదని కూడా తెలిపారు. ఘటనపై ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నామని.. సమగ్ర దర్యాప్తు చేసి వివరాలను చెబుతామన్నారు. రూమర్లను నమ్మొద్దంటూ వివేక్ సోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. యూనివర్సిటీకి చెందిన విద్యార్ధినుల వీడియోలు వైరల్ అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు. సిమ్లాకు చెందిన యువకుడిని కూడా అదుపు లోకి తీసుకొని విచారిస్తామని పంజాబ్ ఐజీ గుర్‌ప్రీత్ దేవ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..