High Tension Wire: రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్‌ వైర్‌.. ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం!

|

Oct 15, 2024 | 6:53 PM

ప్రయాణికులతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హైటెన్షన్‌ విద్యుత్తు వైర్‌లను ఉంచారు. అయితే లోకో పైలెట్‌ సకాలంలో గుర్తించడంతో ప్రమదం తప్పింది..

High Tension Wire: రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్‌ వైర్‌.. ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం!
High Tension Wire
Follow us on

ఉత్తరాఖండ్‌, అక్టోబర్‌ 15: ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఖతిమా రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. రైలు లోకో పైలట్లు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున డెహ్రాడూన్‌ – తనక్‌పూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌.. తిమా రైల్వే స్టేషన్‌ను దాటిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్‌పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు పడి ఉండటాన్ని గుర్తించిన లోకో పైలట్‌ వెంటనే రైలును ఆపుజేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న వైర్‌ను తొలగించడంతో రైలు ముందుకు సాగింది.

ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ దర్యాప్తు ప్రారంభించింది. ఉత్తరాఖండ్ పోలీసుల సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. భారతీయ న్యాయ్ సంహిత్ (BNS)లోని పలు సెక్షన్ల కింద గుర్తు తెలియని నిందితులపై కేసు కూడా నమోదు చేశారు. ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు ట్రాక్‌పై పడ్డాయా లేదంటే ఎవరైనా కుట్ర పూరితంగా రైలు ప్రమాదానికి పన్నాగం పన్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఖతిమా స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుంచి బయల్దేరినా కాసేపటికే లోకో పైలట్‌లు రైలును నిలిపివేసినట్లు తెలిపాడు. లోకో పైలట్‌లు రైల్వే ట్రాక్‌పై పొడవైన వైర్‌ని చూశామని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభమైంది. బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

కాగా ఈ ఏడాది సెప్టెంబరులో కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రైలు ప్రమాదానికి కుట్ర పన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా.. రైలు పట్టాలపై ఉంచిన ఎల్‌పిజి సిలిండర్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో తృటిలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. రైలు లోకోమోటివ్ పైలట్ ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్, ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించాడు. ఆ తర్వాత అతను వెంటనే బ్రేకులు వేశాడు. అయితే రైలు సకాలంలో ఆగకపోవడంతో సిలిండర్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత ఆగిపోయింది. ఉత్తరాఖండ్‌లో మాత్రమేకాకుండా దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాలకు కుట్రలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ట్రాక్‌లపై గ్యాస్‌ సిలిండర్లు, ఇనుప పట్టీలు, సిమెంట్‌ దిమ్మెలు ఉంచడం, ఇసుకను పోయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేకం వెలుగు చూశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.