జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షం కురుస్తోంది. వరదలు వచ్చే అవకాశం ఉంది. వర్షం కారణంగా నదులు, కాలువల నీటిమట్టం పెరిగింది. అదే సమయంలో ఎగువ ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచి మంచు వర్షం కురుస్తోంది. సోనామార్గ్‌లో తాజాగా కురిసిన మంచు 3 అంగుళాలకు పైగా పేరుకుంది. దీంతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి మూసివేశారు. అంతేకాదు జోజిలా, సాధన టాప్, రజ్దాన్ పాస్, దావర్ గురేజ్, తులైల్ గురేజ్, మచిల్, కొంగ్‌డోరి, మెయిన్ గుల్‌మార్గ్, సింథాన్ టాప్, మొఘల్ రోడ్‌లలో కూడా భారీ హిమపాతం ముంచేసింది.
కాశ్మీర్‌లో రానున్న కొన్ని రోజుల పాటు ఎక్కువ వర్షాలు, తేలికపాటి మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక్కడ కొనసాగుతున్న వర్షాల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సోమవారంతో పోలిస్తే తీవ్రత, ప్రభావం తక్కువగానే ఉండబోతోంది. కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు, తీవ్రమైన వడగళ్ల వాన, బలమైన గాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. మే 1వ తేదీ వరకు జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రయాణించవద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం కాశ్మీర్‌లో వరద ముప్పు ప్రమాదం లేదని కాశ్మీర్‌లోని నీటిపారుదల, వరద నియంత్రణ (ఐ అండ్ ఎఫ్‌సి) విభాగం ప్రజలకు హామీ ఇచ్చింది. వాతావరణ పరిస్థితిని తమ డిపార్ట్‌మెంట్ చురుకుగా పర్యవేక్షిస్తున్నదని, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. జీలం నది, ఇతర నీటి వనరులలో నీటి మట్టాన్ని గంట ప్రాతిపదికన అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
జీలం నది, చుట్టుపక్కల నివసించే ప్రజలు, పర్యాటకులకు శ్రీనగర్ పరిపాలన అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర సమయంలో వరద నియంత్రణ గది ద్వారా జారీ చేయబడిన ఫోన్ నంబర్లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. ప్రతికూల వాతావరణం, హిమపాతం హెచ్చరిక కారణంగా కుప్వారాలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మాత్రం డ్యూటీలో ఉంటారు.
అదే సమయంలో రాంబన్-గుల్ రహదారిపై ల్యాండ్ స్లైడ్లు నిరంతరం జరుగుతున్నాయి. అనేక కిలోమీటర్ల మేర భూమి కుంగిపోయింది. రాంబన్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెర్నోట్ గ్రామంలో ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. ల్యాండ్ స్లైడ్ తరువాత స్థానిక పరిపాలనఅధికారులు చాలా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ ప్రాంతంలో వర్షాల కారణంగా, పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 60 వేల మందికి పైగా ప్రధాన నగరంతో సంబంధాలు కోల్పోయారు. ఇళ్లకు పగుళ్లు రావడంతో ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
భూమి కుంగిపోవడంతో పంటలు కూడా దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భూమి క్షీణించడం వల్ల, గూల్, రాంబన్ మధ్య రహదారి కనెక్టివిటీ పోయింది. 16 ఇళ్లు ధ్వంసమయ్యాయి. జమ్మూ యూనివర్శిటీలోని జియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ ప్రకారం, రాంబన్ జిల్లాలోని పర్నోట్ గ్రామంలో భూమి కుంగిపోవడానికి, పగుళ్లు రావడానికి కారణం చీనాబ్ నదిలో జరుగుతున్న టెక్టోనిక్ కదలిక కావచ్చు అని వాతావరణ శాఖా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే భూమి ఉపరితలం కింద అల్లకల్లోలం కావచ్చని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..