Cyclone Effect: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఐదు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ అలర్ట్..!

|

Oct 17, 2024 | 8:41 AM

దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం దడపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వానగండం పొంచి ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడపజిల్లాలను ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వార్నింగ్ వణికిస్తోంది.

Cyclone Effect: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఐదు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ అలర్ట్..!
Heavy Rains
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం(అక్టోబర్ 17) తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ప్రాంతంలో ఒకటో నంబర్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. వాయుగుండం తీరం దాటడంతో ఉత్తర తమిళనాడు, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు వరుణుడు విరుచుకుపడుతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం… తీవ్ర వాయుగుండంగా మారింది. తీరం దాటిన వాయుగుండం కారణంగా ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి.

ఇప్పటికే.. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు కనిపించట్లేదు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ఐటీ కంపెనీల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది.

భారీ వర్షాలతో చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు తోపాటు మొత్తం 10 జిల్లాలకు ఆరెంజ్ ​అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. వాయుగుండం దూసుకొస్తుండటంతో మోస్తరు వర్షాలు కాస్తా… కుండపోతగా మారుతాయని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తోంది.

మరోవైపు.. క‌ర్ణాట‌కలోనూ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బెంగ‌ళూరు వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతుండగా.. మరో రెండు రోజులపాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో బెంగ‌ళూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు కర్నాటక ప్రభుత్వం సెలవులు ప్రక‌టించింది. అలాగే.. ఉద్యోగులు వీలైనంత వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించింది.

వీడిమో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..