అయ్యో పాపం.. స్కూల్‌కు వెళ్లిన ఆరేళ్ల చిన్నారికి ఇంతటి ఘోరమా? రాళ్లు, పూలకుండీతో దాడి..!
హర్యానాలోని పంచకులలో పాఠశాలలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సెక్టార్-20లోని సంస్కృతి మోడల్ స్కూల్‌లో కేజీ చదువుతున్న ఆరేళ్ల బాలికపై మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, పూలకుండీతో విచక్షణారహితంగా కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

హర్యానాలోని పంచకులలో పాఠశాలలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సెక్టార్-20లోని సంస్కృతి మోడల్ స్కూల్‌లో కేజీ చదువుతున్న ఆరేళ్ల బాలికపై మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, పూలకుండీతో విచక్షణారహితంగా కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన అక్టోబర్ 28న జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి పిలుస్తున్నాడంటూ నమ్మించి..
వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, బాలికను ఆమె తండ్రి పిలుస్తున్నాడని నమ్మించి బాలుడు పాఠశాలలోని మరో గదికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఆమెపై రాళ్లతో దాడి చేయడంతో పాటు పూలకుండీతో తలపై కొట్టినట్లు సీసీటీవీ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. బాలిక స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దాడికి తెగబడ్డాడు. అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు
తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత పంచకుల సెక్టార్-6 సివిల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. తొలుత పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, అక్టోబర్ 31న కొంత కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పాఠశాల భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు తలెత్తాయి. బాలిక కనిపించకపోవడంతో తండ్రి చాలాసేపు పాఠశాలలో వెతికారని కుటుంబ సభ్యులు తెలిపారు. పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ ఘటనను సకాలంలో ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన విద్యార్థే గాయపడిన బాలిక ఉన్న ప్రదేశానికి కుటుంబ సభ్యులను తీసుకెళ్లినట్లు కూడా వారు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ పూర్తికావాల్సి ఉంది.
విచారణ కమిటీ ఏర్పాటు.. కఠిన చర్యలకు మంత్రి హామీ
ఈ ఘటనపై హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా స్పందించారు. ఘటనకు సంబంధించిన వీడియో తనను తీవ్రంగా కలచివేసిందని, ఇంత చిన్న వయసున్న బాలికపై ఇలాంటి దాడి జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పాఠశాల యాజమాన్యం లేదా సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠినమైన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోలీసుల దర్యాప్తు.. పిల్లల భద్రతపై చర్చ
మరోవైపు, పంచకుల సెక్టార్-20 పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పాఠశాల యాజమాన్యాన్ని, నిందిత విద్యార్థి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. బాలుడి ప్రవర్తన, దాడికి దారితీసిన పరిస్థితులు, పాఠశాల పర్యవేక్షణలో జరిగిన లోపాలపై విచారణ కొనసాగుతోంది. బాలుడి మానసిక పరిస్థితిని అంచనా వేయాల్సిన అవసరంపైనా దృష్టి సారించారు. ఈ ఘటన ఒక పాఠశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. విద్యార్థుల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ, ఉపాధ్యాయుల బాధ్యత, చిన్నారుల ప్రవర్తనపై తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
