Google Help: కరోనా కష్టకాలంలో గూగుల్‌ చేయూత.. రూ.113 కోట్ల భారీ విరాళం.. ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ

దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న అలజడి అంతా ఇంత కాదు. కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్న భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్‌ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించింది.

Google Help: కరోనా కష్టకాలంలో గూగుల్‌ చేయూత.. రూ.113 కోట్ల భారీ విరాళం.. ఆక్సిజన్ల  ప్లాంట్ల ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ
Google Commits Boost Healthcare Infra In India

Google Commits Boost Healthcare Infra: దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న అలజడి అంతా ఇంత కాదు. కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్న భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్‌ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించింది. 15.5మిలియన్ల డాలర్లు అంటే రూ.113 కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్.ఆర్గ్ గురువారం ప్రకటించింది. ముఖ్యంగా హెల్త్‌ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపింది. గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనున్నట్లు తెలిపింది.

భారతదేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న అలజడి అంతా ఇంత కాదు. వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ సెకండ్‌వేవ్ విరుచుకుపడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీన్ని కట్టడి చేసే క్రమంలో వ్యాప్తిని అడ్డుకుని, చెయిన్ బ్రేక్ చేయడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు వివిధ రకాల నియమనిబంధనలు, నిషేధాలను విధిస్తున్నాయి. దీంతో కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు దిగివస్తున్నాయి.

అయితే, ఉన్న భయాలకు తోడుగా మరింత ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే కోవిడ్ 19 కొత్త మ్యూటంట్ స్ట్రెయిన్ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు నిపుణులు దీని మీద పరిశోధన చేస్తుండగా, మరోవైపు వైరాలజిస్ట్‌లు ఈ కొత్త వేరియంట్‌ను విశ్లేషించి, వ్యాప్తిని నివారిస్తూ దాని వల్ల కలిగే లక్షణాలు, ఇబ్బందుల గురించి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు వృద్ధులకు, మధ్య వయస్కులతో పాటు యువతను రాకాసి వైరస్ బారినపడ్డారు. అయితే తాజాగా థర్డ్ వేవ్ రూపంలో పిల్లలు సైతం అనారోగ్యానికి గురై ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చిరస్తున్నారు. కరోనా వైరస్ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురికావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలావుంటే, గూగుల్ సంస్థ తరఫున గివ్ఇండియా, పాత్ సంస్థల ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గివ్ఇండియా సంస్థకు రూ.90 కోట్లు, పాత్ సంస్థకు రూ.18.5 కోట్లు అందించిన గూగుల్.. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సహాయాన్ని అందిస్తాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, వాటిని సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ఇతర అధికారులతో కలిసి మౌలిక సదుపాయాలను కల్పించాలని గూగుల్ సంస్థ భావిస్తోంది.

అలాగే అపోలో మెడీ స్కిల్స్‌ ఇనీషియేటివ్‌తో కలిసి, 20వేల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కోసం నిధులను వినియోగించనుంది. ముఖ్యంగా గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు, ఆరోగ్య వ్యవస్థలకు సహాయం చేయడమే లక్ష్యమని గూగుల్‌ ఆర్గ్‌ వెల్లడించింది. దీంతోపాటు ఆశా, ఎఎన్‌ఎం వర్కర్ల శిక్షణా నిమిత్తం ఏకంగా రూ. 3.6 కోట్లు (5 లక్షల డాలర్లు) గ్రాంట్‌ను అందివ్వనుంది. తద్వారా 15 రాష్ట్రాలలో లక్షా 80వేల ఆశా వర్కర్లకు, 40వేల ఎఎన్‌ఎంలకు అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేయనుంది.

కరోనా సంక్షోభంలో విలవిల్లాడిన బాధితులకు సానుభూతి ప్రకటించిన గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కష్ట కాలంలో భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆక్సిజన్‌ ప్లాంట్లనిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టిపెట్టామని ట్వీట్‌ చేశారు. అలాగే కరోనా విలయం సమయంలో ప్రభుత్వాలతో వ్యక్తులుగా, సమూహాలుగా ఇంతకుముందెన్నడూ లేని విధంగా దేశంలో అనేకంది స్పందించారనీ, ఈ క్రమంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషించిదనీ కంట్రీ హెడ్, వైస్‌ ప్రెసిడెట్‌ సంజయ్ గుప్తా వ్యాఖ్యానించారు. కాగా ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలు, అత్యవసర సహాయక చర్య కోసం గూగుల్ ఏప్రిల్‌లో రూ .135 కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే.

Read Also…. Digital Eye Strain: ఎక్కువ గంటలు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారా ? కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..