Video: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి.. వీడియో వైరల్..
కన్యాకుమారిలోని కిల్‌మీదలం బీచ్‌లో 10 అడుగుల భారీ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది. మత్స్యకారుల వలలో చిక్కుకున్న ఈ 2 టన్నుల తిమింగళం చివరకు మరణించింది. గాయాలు లేదా ఊపిరాడకపోవడం వల్ల అది మృతి చెందిందని అధికారులు భావిస్తున్నారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో భారీ తిమింగళం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కిల్మీదలం సముద్ర తీరానికి సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉన్న ఒక భారీ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది. ఇంత పెద్ద తిమింగలం ఒడ్డుకు రావడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ తిమింగలం మృతి చెందడానికి ముందు మత్స్యకారుల వలలో చిక్కుకుంది. తిమింగలాన్ని కాపాడే ప్రయత్నంలో, మత్స్యకారులు వెంటనే ఆ వలను కత్తిరించి నీటిలోకి విడుదల చేశారు. అయినప్పటికీ తిమింగలం బతికలేదు. వలలో చిక్కుకోవడం వల్ల అయిన గాయాల వల్ల అది మృతి చెంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
తిమింగలం మృతదేహం ఒడ్డుకు చేరిన విషయం తెలుసుకున్న అటవీ, పర్యావరణ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాని మరణానికి ఖచ్చితమైన కారణమేమిటి అనే విషయాలను తెలుసుకుని పనిలో నిమగ్నమయ్యారు. సాధారణంగా తిమింగలాలు లేదా ఇతర సముద్ర జీవులు ఒడ్డుకు కొట్టుకురావడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఇవి వలలో చిక్కుకోవడం, అనారోగ్యం వల్ల అవి ఒడ్డుకు కొట్టుకొస్తుంటాయి. ఇటీవల ఒడిశాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ భారీ తిమింగళం కళేబరం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.




