ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ క్రూయిజ్ గంగా విలాస్‌ను జనవరి 13న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ లగ్జరీ క్రూయిజ్ భారతదేశం, బంగ్లాదేశ్‌లోని రెండు మహానదులపై 3,200 కి.మీ. మేర ప్రయాణించనుంది. అయితే, ప్రధాని మోడీ మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఈ విలాసవంతమైన క్రూయిజ్ గంగా విలాస్.. సోమవారం గంగా నదిలో నిలిచిపోవడం కలకలం రేపింది. బీహార్‌లోని చాప్రాలో ఈ భారీ క్రూయిజ్ ఆగిపోయింది. దీంతో టూరిస్టులను చిన్న పడవల్లో తరలించారు. ఈ పడవ గంటల తరబడి అక్కడే ఆగిపోవడంతో దీన్ని చూడటానికి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అక్కడికి రప్పించారు. తరువాత గంగా విలాస్ క్రూజ్‌లో ఉన్న విదేశీ టూరిస్టులకు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. చిరాండ్ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడానికి డోరిగంజ్‌కు చేరుకుంటున్న సమయంలో క్రూయిజ్ నీటిలోనే నిలిచిపోయింది. గంగానదిలో నీటిమట్టం ఆకస్మాత్తుగా తగ్గిపోవడంతో నది లోనే క్రూజ్ నిలియిపోయింది.
అయితే ఒడ్డున నీరు తక్కువగా ఉండడంతో విహారయాత్ర క్రూయిజ్‌ను ఒడ్డుకు చేర్చడం కష్టమని అధికారులు పేర్కొన్నారు. అయితే, చిన్న పడవ ద్వారా పర్యాటకులను ఒడ్డుకు చేర్చారు. చిరంద్‌లో పర్యాటకుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఛప్రా సీఓ సతేంద్ర సింగ్ తెలిపారు.
గంగా విలాస్ క్రూజ్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీని వేగం అప్‌స్ట్రీమ్‌లో గంటకు 12 కిలోమీటర్లు, దిగువకు 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. క్రూయిజ్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌తో పాటు తాగునీటి కోసం RO వ్యవస్థ ఉంది. క్రూయిజ్‌లో ప్రజల సౌకర్యార్థం మరియు వారి అవసరాల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
లగ్జరీ క్రూయిజ్ 3,200 కి.మీ పాటు భారతదేశం, బంగ్లాదేశ్‌లోని 5 రాష్ట్రాల్లో ప్రయాణించనుంది. వారణాసిలో ప్రారంభమై ఈ క్రూయిజ్ యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, అస్సాంలోని మొత్తం 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణించి దిబ్రూగర్ చేరుకుంటుంది. ఈ క్రూయిజ్ గంగా, మేఘన, బ్రహ్మపుత్ర ప్రధాన నదుల గుండా ప్రయాణం చేయనుంది. 51 రోజులపాటు ప్రయాణించే ఈ క్రూయిజ్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నది ఘాట్‌లు సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శించనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..