దేశంలో ఇంధన ధరలు(Fuel Prices) గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. కాగా.. ఏప్రిల్ నెలలో చమురు వాడకం రికార్డు స్థాయిలో తగ్గింది. మార్చి నెలతో పోల్చితే 10 శాతం క్షీణించింది. పెట్రోల్, డీజిల్(Diesel) ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్(Petrol) విక్రయాలు దాదాపు 10 శాతం తగ్గాయి. డీజిల్ వినియోగం 15.6 శాతం పడిపోయాయి. వంటకు ఉపయోగించే ఎల్పీజీ వినియోగం సైతం గత నెలతో పోలిస్తే 1.7 శాతం తగ్గగా.. జెట్ ఫ్యూయల్ వినియోగం సైతం 20.5 శాతం మేర తగ్గడం గమనార్హం. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలో 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వరంగ చమురు సంస్థలు మార్చి 22న ఒక్కసారిగా వాటి ధరలను పెంచేశాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య ఎన్నడూ లేని స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధర రూ.10 మేర పెరిగింది. వంట గ్యాస్ ధర సైతం రూ.50 చొప్పున పెరిగింది.
మార్చి మొదటి వారంలో డీలర్లు, సామాన్య ప్రజలు తమ ట్యాంకులను నింపేసుకున్నారు. దీంతో మార్చిలో పెట్రో వినియోగం మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. తద్వారా మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెల తొలి అర్ధభాగంలో వినియోగం తగ్గింది. కేవలం ధరలు పెరుగుతాయన్న ముందస్తు అంచనాలతో మార్చిలో పెద్ద ఎత్తున కొనుగోలు జరపడం వల్లే ఏప్రిల్‌లో వినియోగం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.
Also Read
Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?