ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీ తమ కంటే బలంగా ఉన్నా సరే.. ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడదు. తాము గెలుస్తామన్న ధీమానే ప్రతి పార్టీ వ్యక్తం చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి బలాన్ని అంగీకరించక తప్పదు. ఇప్పుడు అదే జరిగింది. ఈ మధ్యనే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడు పెద్ద రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో మాత్రమే గెలుపొంది పరువు నిలుపుకుంది. ఈ ఎన్నికల ఫలితాలను ఒక్కొక్కరు ఒక్కోలా విశ్లేషించుకుంటున్నారు. అయితే 138 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలు ఏమంటున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉత్తర, మధ్య భారతదేశంలో బీజేపీ హవా నడుస్తోందని ఆయన ఓ వార్తా సంస్థ (PTI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రత్యర్థి బలాన్ని అంగీకరిస్తూనే.. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాలంటే ఏం చేయాలో కొన్ని సూచనలు చేశారు. గాలి దిశ మారుతుందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్.. మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోవడం అన్నది ఊహించని పరిణామం అని, విపక్ష కూటమికి ఆందోళన కల్గించే అంశమని అభిప్రాయపడ్డారు.
భారతీయ జనతా పార్టీ (BJP) ప్రతి ఎన్నికలను అవే తమ చివరి ఎన్నికలుగా, అంతిమ యుద్ధంగా భావించి పోరాడుతుందని చిదంబరం ప్రశంసించారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని గుర్తించాలని కూడా ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ఆ పార్టీకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని, కాంగ్రెస్ ఓటమి పార్టీ నాయకత్వం బలహీనతను బయటపెడుతోందని అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో ముస్లింలు, క్రిస్టియన్లపై బీజేపీ ప్రదర్శించే పరోక్ష వ్యతిరేకత, అతి జాతీయవాదం ఆ పార్టీకి సానుకూలాంశాలని, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న ప్రశ్నకు సరైన సమాధానం కనుగొనాల్సి ఉందని చిదంబరం అన్నారు. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశాల్లో అతి జాతీయవాదం, ముస్లిం – క్రైస్తవ వ్యతిరేకత అంశాలు ప్రభావం చూపుతున్నాయని, ఇదొక అద్భుతమైన కాంబినేషన్‌గా మారిందని, విపక్ష కూటమికి ఇది కచ్చితంగా ఆందోళన కల్గించే అంశమని సూత్రీకరించారు. ఇన్నాళ్లుగా ఉచితాలకు తాము వ్యతిరేకం అని చెబుతూ వచ్చిన బీజేపీ, ఆ ప్రేలాపనలు విడిచిపెట్టిందని గుర్తుచేశారు.
లోక్‌సభ ఎన్నికల కోసం కులగణన అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ తమ సొంత నేతలనే ఈ విషయంలో ఒప్పించలేకపోతోంది. ఇదేమీ అంత నిర్ణయాత్మకమైన అంశం కాకపోవచ్చు అని చిదంబరం అభిప్రాయపడ్డారు. అనేక సంస్థలు నిర్వహించిన సర్వేల్లో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అంశాలే అగ్రభాగాన నిలిచాయని గుర్తుచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయే మరోసారి విజయం సాధిస్తుందన్న సర్వే ఫలితాలపై ప్రశ్నించగా.. ప్రస్తుతం గాలి బీజేపీకి అనుకూలంగా వీస్తున్న మాట నిజమేనని, అయితే గాలి దిశ మారుతుందని తెలిపారు. బీజేపీ ఏ ఎన్నికలనూ తేలిగ్గా తీసుకోదని, ఇదే ఆఖరి పోరాటం అన్నట్లుగా ఆ పార్టీ పోరాడుతుందని తెలిపారు. బీజేపీ పోరాట పటిమను ప్రతిపక్షాలు గుర్తించాల్సిందేనని పి. చిదంబరం వ్యాఖ్యానించారు.
విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ముందే ఆ విషయం గురించి మాట్లాడితే భాగస్వామ్య పార్టీల నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యే ప్రమాదం ఉంది. కానీ గత దశాబ్దకాలంగా దేశంలో ఎన్నికలు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది చూసి ఓటేస్తున్నారు. ప్రధాని అభ్యర్థి నచ్చితే స్థానికంగా పోటీ చేస్తున్న నేత ఎవరన్నది కూడా చూడకుండా ఓటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లడం ఒక లోపంగానే మారుతుంది. అయితే కూటమి నేతల పట్ల ప్రజల స్పందన ప్రధాని అభ్యర్థిని గుర్తించడంలో సహాయపడుతుందని చిదంబరం అంటున్నారు. ఆ అంశం కంటే సీట్ల సర్దుబాటు అన్నదే కూటమిలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన అంశంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిని ఎంపిక చేస్తామని, నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రజల స్పందన ముఖ్యమని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపే తమ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..