ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వసూళ్లు.. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడి అరెస్ట్

|

Nov 29, 2021 | 3:12 PM

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడు కటకటాలపాలయ్యాడు.

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వసూళ్లు.. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడి అరెస్ట్
Edappadi Palaniswami
Follow us on

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడు కటకటాలపాలయ్యాడు. తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి మాజీ సహాయకుడు మణిని సేలం జిల్లా క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు సీఎంగా పనిచేసినప్పుడు.. సేలం సమీపం ఓమలూరు నడుపట్టికి చెందిన మణి ఆయన వద్ద సహాయకుడిగా పని చేశారు. తన పలుకుబడితో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి నిరుద్యోగ యువకుల వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేశారు. అయితే ఉద్యోగులు ఇప్పించకపోగా.. వారిదగ్గర తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా మోసగించాడు.

కడలూరు జిల్లా నైవేలికి చెందిన తమిళసెల్వన్‌ అనే నిరుద్యోగికి తమిళనాడు రవాణా శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.17 లక్షలు వసూలు చేశాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోగా.. తాను ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంతో తమిళసెల్వన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తే తీవ్ర పరిణామాలుంటాయని మణి బెదిరించినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తమిళసెల్వన్ ఫిర్యాదు మేరకు పోలీసులు మణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా మణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను సేలం కోర్టు, మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చాయి. దీంతో పరారీలో ఉన్న మణి ఆచూకీని గుర్తించిన సేలం క్రైం విభాగం పోలీసులు.. ఆదివారం ఉదయం అరెస్టు చేశారు.

మణి, తమిళసెల్వన్‌కు మధ్య బ్రోకర్‌గా వ్యవహరించిన సెల్వకుమార్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు ఈ వ్యవహారంలో కేసు నమోదుచేశారు. ప్రభుత్వ ఉద్యోగం పేరిట మణి చేతిలో మోసపోయిన మరికొందరు నిరుద్యోగ యువకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అమాయక యువకుల నుంచి మణి దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also Read..

Telangana: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 42 మంది విద్యార్థినులకు పాజిటివ్..

Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..