దేశ రాజధాని ఢిల్లీలో నూతన మోటార్ వెహికల్ చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలిరోజు ఏకంగా 4వేల చలాన్లు రాసి రికార్డు సృష్టించారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల బెండు తీశారు పోలీసులు. కొంచెం అనుమానం వచ్చిన కొత్త చలాన్లతో బాదేశారు. తొలిరోజు నిబంధనలు అమలుకోసం ప్రత్యేకంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) 2,500 మంది ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడే కాపు కాసారు. వాహనాలు తనిఖీ చేపట్టారు. వీరి తనికీల్లో నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే అక్కడిక్కడే చలాన్లు వేశారు.
సెప్టెంబర్ 1 నుంచి మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 199 ఏ సవరించిన నిబంధనల ప్రకారం 63 సరికొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. హెల్మెట్ లేకపోవడం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం, మైనర్లు వాహనం నడిపడం, లైసెన్స్ లేకపోవడం, సిగ్నల్ జంప్ చేయడం, ఇన్స్యూరెన్స్ కాపీ లేకపోవడం వంటి అతిక్రమణలకు భారీగా చలాన్లు విధించడం, శిక్షలు అమలు జరపడం వంటి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ ట్రాఫిక్ రూల్స్ తెలంగాణాలో ఇంకా అమలులోకి రాలేదు.