FIR Lodged Against Kangana Ranaut: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఒక్కసారిగా రెచ్చిపోయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సైతం తన గళం వినిపించింది. అంతటితో ఆగకుండా వరుసగా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజు.. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగకుండా జాతిపిత మహాత్మా గాంధీపైన కూడా పలు వ్యాఖ్యలు చేసింది. తాజాగా కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడంపై మహరాష్ట్ర ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
గురునానక్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన చేశారు. అనంతరం.. కంగనా రనౌత్.. సిక్కులపై తీవ్రవ్యాఖ్యలు చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులుగా అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వారిని చితకబాదారని.. బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారందరికీ.. అలాంటి గురువు కావాలంటూ ఆమె రాశారు. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ.. సిక్కుల ఫిర్యాదు మేరకు కంగనా రనౌత్‌పై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. మొదటినుంచి ప్రధాని మోదీకి మద్దతునిస్తూ వస్తున్న కంగనా రనౌత్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటు, అన్యాయమని.. పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న ప్రజలు చట్టాలు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
Also Read: