Nitin Gadkari: ఇక వెనుక సీట్లో కూర్చున్నా అది పెట్టుకోవల్సిందే.. లేదంటే భారీ జరిమానా దిశగా కేంద్రం ఆలోచన..?
రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రప్రభుత్వం మరింత దృష్టిసారిస్తున్నట్లు కన్పిస్తోంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రజల సహకారం లేకుండా రోడ్డు..
Nitin Gadkari: రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రప్రభుత్వం మరింత దృష్టిసారిస్తున్నట్లు కన్పిస్తోంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రజల సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. చివరకు ముఖ్యమంత్రులు కూడా సీట్ బెల్ట్ వంటి భద్రతా నియమాలు పాటించరని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కారులోని వెనక సీట్లలో కూర్చునే ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని, సీటుబెల్టు అవసరం లేదనే భావనలో వారుంటారని తెలిపారు. తాను ఇక్కడ నేను ఏ రోడ్డు ప్రమాదం గురించి ప్రస్తావించడం లేదంటూనే.. ముందు, వెనక సీట్లలో కూర్చొన్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని తెలిపారు.
తాను పలువురు ముఖ్యమంత్రులతో కారులో ప్రయాణించిన సందర్భాలున్నాయని వారితో ప్రయాణించేప్పుడు తాను ముందు సీట్‌లో కూర్చున్నానని… ఆ సమయంలో వారు కారు భద్రతా నియమాలు పాటించలేదన్నారు. ఒకవేళ మనం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అలారం మోగుతుందని.. కానీ డ్రైవర్లు క్లిప్ పెట్టి అలారం ఆపేవారని చెప్పారు. ఇక్కడ మనకు సహకారం ఉంటేనే ప్రమాదాలు ఆగుతాయని గడ్కరీ తెలిపారు. వెనుకాల సీట్లో కూర్చునేవారు సీటు బెల్టు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేయాలనే యోచనలో కేంద్రప్రభుత్వం ఉందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు ఫాలో అయితే రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. జరిమానాలు విధించడం తమ ఉద్దేశ్యం కాదని.. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు. 2024 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..