Inspiration Story: తొలి ప్రయత్నంలోనే ‘నీట్’ క్లియర్ చేసిన తండ్రికూతుళ్లు.. కుమార్తె కోసం తండ్రి సాహసం
తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న తన చేతలతో మనలో మనోధైర్యం నింపుతాడానేది అక్షర సత్యం. నాన్నే మన మొదటి గురువు. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమించే నాన్న స్ఫూర్తిగా.. ప్రేరణగా.. ఆదర్శంగా నిలుస్తాడని చెప్పడనికి మరో ఉదాహరణ ఈ తండ్రీకూతుళ్ల కథ. కూతురిలో ధైర్యం నింపడానికి ఆ తండ్రి ఏకంగా ఎంతో కఠినమైన నీట్ పరీక్షను క్లియర్ చేశాడు. తండ్రీకూతుళ్లు పోటాపోటీగా చదివి..
తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న తన చేతలతో మనలో మనోధైర్యం నింపుతాడానేది అక్షర సత్యం. నాన్నే మన మొదటి గురువు. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమించే నాన్న స్ఫూర్తిగా.. ప్రేరణగా.. ఆదర్శంగా నిలుస్తాడని చెప్పడనికి మరో ఉదాహరణ ఈ తండ్రీకూతుళ్ల కథ. కూతురిలో ధైర్యం నింపడానికి ఆ తండ్రి ఏకంగా ఎంతో కఠినమైన నీట్ పరీక్షను క్లియర్ చేశాడు. తండ్రీకూతుళ్లు పోటాపోటీగా చదివి మొదటి ప్రయత్నంలోనే ర్యాంకులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
50 ఏళ్ల వికాస్ మంగోత్రా ఢిల్లీలో ఓ కార్పొరేట్ ఉద్యోగి. ఆయన కుమార్తె మీమాన్స (18) ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆమెకు ఓ డౌట్ వచ్చింది. వెంటనే నాన్న దగ్గరికి వచ్చి అడగ్గా.. సింపుల్‌గా చెప్పేశాడు. అంతే.. కఠినమైన కాన్సెప్ట్‌లను చాలా ఈజీగా చెప్పేస్తున్న నాన్నను చూసి.. కూతురికి ఆశ్చర్యం వేసింది. నీట్ పరీక్షకు తండ్రిని టీచర్‌గా సెలెక్ట్ చేసుకుంది. ఈ విషయం మంగోత్రాకు చెప్పడంతో ఆయన కూడా తన కుమార్తెకు మంచి ఉపాధ్యాయుడిగా ఉండాలనుకున్నాడు. అలా ఇద్దరూ కలిసి నీట్ యూజీ పరీక్షకు సిద్ధమయ్యారు. అనంతరం ఢిల్లీ NCRలో వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో ఇద్దరూ పరీక్షలు రాశారు. తాజాగా వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఒకే ప్రయత్నంలో ఇద్దరూ క్వాలిఫై అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నిజానికి, జమ్మూకి చెందిన మంగోత్రా 2022లో కూడా నీట్‌లో అర్హత సాధించారు. ఆయన 90వ దశకం ప్రారంభంలో రాష్ట్ర PMTకి హాజరై.. డాక్టర్ కావాలనుకున్నారు. మెడికల్ కాలేజీలో సీటు సాధించడానికి తగినంత మార్కులు ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత సమస్యల వలకల ఆ తర్వాత ఏడాది ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు. ఆయన నీట్ మాత్రమే కాదు, రెండు దశాబ్దాల క్రితం గేట్, JKCET, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష వంటి పోటీ పరీక్షలకు కూడా హాజరయ్యారు. 2022లో మొదటిసారిగా నీట్ పరీక్షకు హాజరైనప్పుడు, అది తన స్వంత సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి, పరీక్ష స్వభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడినట్లు ఆయన తెలిపారు. 2024లో రెండవసారి తన కుమార్తెను మోటివేట్ చేయడానికి, తన బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి నీట్ పరీక్ష రాసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మంగోత్రా మీడియాతో మాట్లాడుతూ..
‘నీట్ పరీక్ష రాసేముందు తొలుత నా వయసు గురించి కొంత సందేహించాను. కానీ 2021లో ఒడిషాలో 60 ఏళ్ల వ్యక్తి కూడా నీట్‌లో అర్హత సాధించాడని నేను తెలుసుకున్నాను. దీంతో నా కుమార్తెతోపాటు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాను. నాకు బోధన అంటే అమితాసక్తి. నా పాఠశాల రోజుల నుంచి టీచింగ్ పట్ల ఆకర్షితుడయ్యాను. నా తొలి ప్రయత్నం 2022లో పరీక్ష రాసినప్పుడు నాలుగు నెలలు మాత్రమే చదువుకున్నానని’ తెలిపారు. రోజుకు 15 నుంచి 16 గంటలు చదువుకోవడానికి కేటాయించానని, అందుకు తాను చేస్తున్న ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ ప్రిపేర్ అయినట్లు తెలిపారు. అంతేకాకుండా మంగోత్రా తన కుమార్తెకు బోధించేటప్పుడు పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించానని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రిపరేషన్‌లో సహకరిస్తే వారు సులువుగా గట్టెక్కుతారని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా ఈ ఏడాది మే 5న దేశ వ్యాప్తంగా 571 నగరాల్లో జరిగిన నీట్ యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్ష నిర్వహణ విధానం, ఫలితాల చుట్టూ వివాదాలు నెలకొనడంతో దేశంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.