AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం! చాక్లెట్లు, వడాపావ్ ఆశ చూపి ఇద్దరు కొడుకులను కాలువలోకి తోసేసిన తండ్రి!

మహారాష్ట్రలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న బిడ్డలపై కనికరం లేకుండా ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను కాలువలోకి తోసేశాడు. చాక్లెట్లు, వడాపావ్ కొనిస్తానని ఆశ చూపించి తీసుకెళ్లిన తండ్రి.. చివరకు వారిని మృత్యువు ఒడిలోకి నెట్టేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. 5, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.

దారుణం! చాక్లెట్లు, వడాపావ్ ఆశ చూపి ఇద్దరు కొడుకులను కాలువలోకి తోసేసిన తండ్రి!
Father Throws Two Sons
Balaraju Goud
|

Updated on: Nov 18, 2026 | 10:21 AM

Share

మహారాష్ట్రలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న బిడ్డలపై కనికరం లేకుండా ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను కాలువలోకి తోసేశాడు. చాక్లెట్లు, వడాపావ్ కొనిస్తానని ఆశ చూపించి తీసుకెళ్లిన తండ్రి.. చివరకు వారిని మృత్యువు ఒడిలోకి నెట్టేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. 5, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పైఠాన్ తాలూకా నందార్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సోమనాథ్ దామోదర్ రోడ్గే (40) అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులు శ్యామ్ (5), ఆర్యన్ (7)లను నవంబర్ 16వ తేదీ సాయంత్రం స్కూటీపై బయటకు తీసుకెళ్లాడు. చాక్లెట్లు, వడాపావ్ కొనిస్తానని పిల్లలను నమ్మించాడు. అనంతరం జయక్వాడి ప్రాజెక్టు ఎడమ కాలువ వద్దకు తీసుకెళ్లి, ఇద్దరినీ నీటిలోకి తోసేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను గమనించిన కొందరు రైతులు, స్థానికులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిపై నిందితుడు దురుసుగా ప్రవర్తించడంతో పాటు రాళ్లు విసిరినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాచోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సోమనాథ్ రోడ్గేను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన ఇద్దరు కుమారులను కాలువలోకి తోసేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

మరోవైపు, కాలువలో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో చిన్నారుల ఆచూకీ గుర్తించడం సవాలుగా మారింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. నవంబర్ 18 ఉదయం వరకు కూడా ఇద్దరు చిన్నారుల ఆచూకీ లభించలేదు.

అసలు కన్నబిడ్డలనే కాలువలోకి తోసేయడానికి తండ్రి ఎందుకు ప్రయత్నించాడు? దీని వెనుక కుటుంబ కలహాలా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో నందార్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us