AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్దోషిగా విడుదలైనా ఏడేళ్లు జైలులోనే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!

న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించినా జైలు నుంచి విడుదల చేయకపోవడంతో ఏడేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన వ్యక్తికి సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవిలాల్ గోండ్‌కు గతంలో హైకోర్టు మంజూరు చేసిన రూ.2 లక్షల పరిహారాన్ని ఏకంగా రూ.30 లక్షలకు పెంచింది. అక్రమ నిర్బంధానికి పరిహారం అనేది కేవలం నామమాత్రపు చెల్లింపు కాకూడదని, బాధితుడు తన జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు ఉపయోగపడాలని అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

నిర్దోషిగా విడుదలైనా ఏడేళ్లు జైలులోనే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!
Supreme Court
Balaraju Goud
|

Updated on: Nov 18, 2026 | 8:27 AM

Share

న్యూఢిల్లీ: న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించినా జైలు నుంచి విడుదల చేయకపోవడంతో ఏడేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన వ్యక్తికి సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవిలాల్ గోండ్‌కు గతంలో హైకోర్టు మంజూరు చేసిన రూ.2 లక్షల పరిహారాన్ని ఏకంగా రూ.30 లక్షలకు పెంచింది. అక్రమ నిర్బంధానికి పరిహారం అనేది కేవలం నామమాత్రపు చెల్లింపు కాకూడదని, బాధితుడు తన జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు ఉపయోగపడాలని అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

నిర్దోషిగా తేలినా జైలు నుంచి విడుదల చేయలేదు!

దేవిలాల్ గోండ్‌ను 2012లో హత్య కేసులో అరెస్టు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద నమోదైన ఈ కేసులో 2013లో సెషన్స్ కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే 2018లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అతడి శిక్షను రద్దు చేస్తూ నిర్దోషిగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తీర్పును సవాలు చేయలేదు. అయినప్పటికీ జైలు, న్యాయస్థానాల మధ్య సమాచార లోపం కారణంగా అతడిని విడుదల చేయలేదు.

హైకోర్టు ఉత్తర్వులు జైలుకు సరిగా చేరకపోవడంతో దేవిలాల్ 2025 మే వరకు జైలులోనే ఉండిపోయాడు. దాదాపు ఏడేళ్ల మూడు నెలలపాటు అక్రమ నిర్బంధాన్ని అనుభవించాడు. జైలు అధికారులు విడుదల ఉత్తర్వుల గురించి సంబంధిత న్యాయవాదికి లేఖలు రాసినా సమన్వయ లోపంతో సమస్య పరిష్కారం కాలేదు. చివరకు జైలు రికార్డుల పరిశీలనలో ఈ పొరపాటు బయటపడింది.

రూ.2 లక్షలు సరిపోవన్న సుప్రీంకోర్టు

తనకు జరిగిన అన్యాయానికి రూ.50 లక్షల పరిహారం కోరుతూ దేవిలాల్ హైకోర్టును ఆశ్రయించారు. అతడి నిర్బంధం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని హైకోర్టు అంగీకరించింది. అయితే రూ.2 లక్షల పరిహారం మాత్రమే మంజూరు చేసింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచింది. నిర్దోషిగా విడుదలైనప్పుడు 28 ఏళ్ల వయసున్న దేవిలాల్, జైలు నుంచి బయటకు వచ్చేసరికి 35 ఏళ్లకు చేరుకున్నాడని పేర్కొంది. అతడు తన జీవితంలోని కీలకమైన సంవత్సరాలను కోల్పోయాడని, విద్య, ఉపాధి, కుటుంబ జీవితం, ఆర్థిక స్వాతంత్ర్యంపై తీవ్ర ప్రభావం పడిందని అభిప్రాయపడింది.

ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేసిన ధర్మాసనం

పరిహారం అనేది ప్రభుత్వ దాతృత్వం కాదని, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన రాజ్యాంగ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్బంధానికి పాల్పడినప్పుడు పరిపాలనా లోపాలను సాకుగా చూపలేరని పేర్కొంది. ఇలాంటి బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరమని కూడా సూచించింది.

ఈ తీర్పుతో నిర్దోషులైన వ్యక్తులను విడుదల చేయడంలో జరిగే నిర్లక్ష్యానికి ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యత వహించాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేకపోయినా, బాధితుడికి గౌరవప్రదమైన భవిష్యత్తు కల్పించడం న్యాయవ్యవస్థ బాధ్యతని ఈ తీర్పు చాటిచెప్పింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us