AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రతా దళాల భారీ ఆపరేషన్.. మసీదులో చిక్కుకున్న లష్కరే కమాండర్ ఖతం!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో బుధవారం (నవంబర్ 18) తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో లష్కర్-ఎ-తైబా (LeT) అగ్ర కమాండర్‌గా అనుమానిస్తున్న లతీఫ్ భట్ ఓ మసీదులో చిక్కుకున్నట్లు సమాచారం. అతడిని ప్రాణాలతో పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించినప్పటికీ, లొంగిపోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

భద్రతా దళాల భారీ ఆపరేషన్.. మసీదులో చిక్కుకున్న లష్కరే కమాండర్ ఖతం!
Lashkar Commander Latif Bhat
Balaraju Goud
|

Updated on: Nov 18, 2026 | 8:45 AM

Share

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో బుధవారం (నవంబర్ 18) తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో లష్కర్-ఎ-తైబా (LeT) అగ్ర కమాండర్‌గా అనుమానిస్తున్న లతీఫ్ భట్ ఓ మసీదులో చిక్కుకున్నట్లు సమాచారం. అతడిని ప్రాణాలతో పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించినప్పటికీ, లొంగిపోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు మరో కీలక విజయాన్ని సాధించాయి. కుల్గాం జిల్లాలోని దేవసర్ ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ లతీఫ్ భట్ హతమైనట్లు సమాచారం. గత కొంతకాలంగా భద్రతా బలగాలకు లక్ష్యంగా మారిన భట్, పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటన నేపథ్యంలో దేవసర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

వీడియో కాల్‌లో లొంగిపోవాలని విజ్ఞప్తి

ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలు లతీఫ్ భట్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడాయి. ఆయుధాలు విడిచిపెట్టి బయటకు రావాలని, తమకు లొంగిపోవాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. “మేము మీతో ఉన్నాం” అని భరోసా ఇచ్చారు. అయితే భట్ మాత్రం లొంగిపోవడానికి అంగీకరించలేదు. “నేను అల్లాను కలవాలనుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అల్లా తప్ప నా పక్కన ఎవరూ లేరు” అంటూ సమాధానమిచ్చినట్లు సమాచారం. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ను మరింత తీవ్రతరం చేశాయి.

గత దాడుల్లోనూ ప్రమేయం?

లతీఫ్ భట్ సహచరుడిగా భావిస్తున్న ఉమర్ నిసార్ దార్ సోమవారం కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. నవంబర్ 11న అఖ్రాన్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ చెక్‌పాయింట్‌పై జరిగిన దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటనలో భట్, దార్‌ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు కీలకమైన సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు. దాడికి ముందు నవంబర్ 10న భట్, దార్ పలు ప్రాంతాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించినట్లు ఆ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలాం ప్రాంతాల్లో భద్రతా బలగాల కదలికలు, లక్ష్యాలను పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు.

500 మందికి పైగా విచారణ

దార్ గత ఆరు నెలలుగా భట్‌కు ఆశ్రయం, ఇతర సహాయ సహకారాలు అందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు జూలై 22న అనంతనాగ్‌లో పోలీసులపై జరిగిన దాడి, ఆగస్టు 1న కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్య ఘటనల్లోనూ భట్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కుల్గాం దాడి తర్వాత భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. విచారణలో భాగంగా 500 మందికి పైగా స్థానికులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కుల్గాంలో భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో లతీఫ్ భట్‌ను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. చివరికి ఎదురుకాల్పుల్లో భట్ హతమయ్యాడు. ఈ ఘటనతో కుల్గాం జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us