సాధారణ ఆయుష్షు 17 ఏళ్లే.. కానీ 23 ఏళ్లుగా జీవిస్తూ ప్రపంచ రికార్డు సృష్టించిన రెడ్ పాండా!
జపాన్‌కు చెందిన 23 ఏళ్ల రెడ్ పాండా 'ఫుటా' అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా రెడ్ పాండాలు 12 నుంచి 17 ఏళ్లు మాత్రమే జీవిస్తాయి. కానీ ఫుటా మాత్రం 23 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉంటూ బందిఖానాలో జీవిస్తున్న ప్రపంచంలోనే అత్యంత వృద్ధ రెడ్ పాండాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. రెండు కాళ్లపై నిలబడి ఒకప్పుడు జపాన్ ప్రజలను ఆకట్టుకున్న ఫుటా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

సాధారణంగా రెడ్ పాండాలు 12 నుంచి 17 సంవత్సరాలు జీవిస్తాయి. కానీ ఓ రెడ్ పాండా మాత్రం ఈ సగటు ఆయుష్షును దాటి ఏకంగా 23 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా జీవిస్తూ ప్రపంచ రికార్డు సృష్టించింది. జపాన్‌కు చెందిన ‘ఫుటా’ అనే రెడ్ పాండాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అరుదైన గుర్తింపును అందించింది. బందిఖానాలో జీవిస్తున్న ప్రపంచంలోనే అత్యంత వృద్ధ రెడ్ పాండాగా ఫుటా రికార్డులకెక్కింది. జపాన్‌లోని చిబా సిటీ జూలో నివసిస్తున్న ఫుటాకు ఈ అరుదైన గుర్తింపు రావడంతో జూ సందర్శకుల్లో ఆనందం వెల్లివిరిసింది. నవంబర్ 17న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జూ అధికారులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జూ సిబ్బంది ఫుటాతో తమకున్న అనుబంధాన్ని, అతనితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2003 జూలై 5న జపాన్‌లోని షిజుఒకా మున్సిపల్ నిహోండైరా జూలో ఫుటా జన్మించాడు. తన తండ్రి ఫుఫు పేరు మీదుగానే అతనికి ఫుటా అనే పేరు పెట్టారు. 2004లో చిబా జూకు తరలించగా, అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నాడు.
2005లో ఫుటా తన రెండు వెనుక కాళ్లపై నిటారుగా నిలబడటం ద్వారా జపాన్ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడి ఈ ప్రత్యేకమైన భంగిమ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరకు ఓ క్యాన్డ్ డ్రింక్ వాణిజ్య ప్రకటనలోనూ ఫుటాకు అవకాశం దక్కింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచిన ఫుటా.. ఇప్పుడు గిన్నిస్ రికార్డుతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటివరకు బందిఖానాలో జీవించిన అత్యంత వృద్ధ రెడ్ పాండాగా అమెరికాలోని జూమోంటానా జూకు చెందిన టేలర్ పేరు మీద రికార్డు ఉండేది. టేలర్ 21 సంవత్సరాల 265 రోజుల పాటు జీవించాడు. అయితే ఫుటా 23 సంవత్సరాల 135 రోజుల వయసులో ఈ రికార్డును అధిగమించాడు.
చిబా సిటీ జూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఫుటా గిన్నిస్ సర్టిఫికెట్ ముందు ఉన్న అందమైన ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆరోజు సందర్శకులు ఫుటాను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. అయినప్పటికీ ఫుటా మంచి ఆకలితో, ఆరోగ్యంగానే ఉన్నాడని జూ అధికారులు వెల్లడించారు.
ఫుటాను చూసుకున్న మాజీ కీపర్ ఏమన్నారంటే?
2007 నుంచి 2019 వరకు ఫుటాను చూసుకున్న మాజీ జూ కీపర్ మసాహిరా హమాడా అతడి ప్రజాదరణను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫుటా ఎప్పుడూ అందరి ప్రేమను పొందేవాడని, తన పర్యవేక్షణలో ఉన్న సమయంలో అతడి ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ఫుటా ప్రస్తుతం కూడా ఉత్సాహంగా జీవిస్తున్నాడు. వాతావరణం సరిగా లేనప్పుడు బయటకు రావడానికి ఇష్టపడకపోయినా, తనదైన శైలిలో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. సాధారణ రెడ్ పాండాల ఆయుష్షును దాటి 23 ఏళ్ల వయసులోనూ జీవిస్తూ ప్రపంచ రికార్డు సృష్టించిన ఫుటా ఇప్పుడు జపాన్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.




