
Yogi Adityanath: ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ అధికారులను పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది ఎవరు అంటే గుర్తుకు వచ్చేది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడ తాజాగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు యోగి. అక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. తీవ్రమైన నేరాల్లో జోక్యం ఉన్నట్టు తేలితే అలాంటి పోలీసులను సస్పెండ్ చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవల కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి గోరఖ్‌పూర్‌లో పోలీసుల దాడిలో మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. శాంతిభద్రత తీరుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి స్పందించారు.
ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన యోగి ఆదిత్యనాథ్.. ఇటీవలి కాలంలో కొందరు పోలీసుల అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వ్యక్తులకు పోలీస్ శాఖలో స్థానం లేదని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాంటి పోలీసులను గుర్తించి ఆధారాలతో సహా జాబితాను తయారు చేయాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.
మరోవైపు హోటల్‌లో మృతిచెందిన వ్యాపారి కుటుంబాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఆ వ్యాపారి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆ కుటుంబానికి రూ.10లక్షలు సాయం అందజేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
కాగా, వ్యాపారి మృతి ఘటనపై విపక్ష పార్టీలు సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాన్పూర్‌కు వెళ్లి బాధితుడి కుటుంబ సభ్యులను కలిశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే న్యాయం జరుగుతుందని చెప్పగా, మరోవైపు, బీఎస్పీ అధినేత్రి మాయావతి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆ వ్యాపారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గోరఖ్‌పూర్ హోటల్‌లో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే అధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై హత్య కేసు నమోదు చేశారు.