Shinde VS Uddhav: క్లైమాక్స్‌కు శివసేన ఎన్నికల గుర్తుపై పోరాటం.. ప్లాన్ బీతో రెడీగా ఉన్న ఇరు వర్గాలు
సుప్రీం తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్.. షిండే వర్గం విల్లు-బాణం గుర్తును క్లెయిమ్ చేయడంపై వివరణ ఇవ్వాలని థాకరే వర్గాన్ని ఆదేశించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే తామే తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

శివసేన ఎన్నికల గుర్తుపై పోరాటం క్లైమాక్స్‌కి చేరింది. రెండు వారాలుగా విల్లు-బాణం గుర్తును తమే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్ థాక్రే వర్గం, ఇటు ఏక్‌నాథ్ షిండే వర్గం తెగ పోటీపడుతున్నాయి. ఈ విషయమై సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాయి. ఈలోగా తూర్పు అంధేరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో శివసేన ఎన్నికల గుర్తుపై నిర్ణయం తీసుకోకుండా ఈసీఐని అడ్డుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పింది. ఈ తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్.. షిండే వర్గం విల్లు-బాణం గుర్తును క్లెయిమ్ చేయడంపై వివరణ ఇవ్వాలని థాకరే వర్గాన్ని ఆదేశించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే తామే తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ప్లాన్ బీతో ఇరు వర్గాలు..
ఈవిషయంపై ఈసీ శనివారం వరకూ గడువు ఇచ్చినా, శివసేన తమ సమాధానాన్ని శుక్రవారమే అందజేసింది. ఏక్‌నాథ్ షిండే వర్గం స్వచ్ఛందంగా పార్టీని వీడి వెళ్లిపోయారని, అలాంటప్పుడు పార్టీ గుర్తు వాళ్లది చెందకూడదని థాక్రే వర్గం పేర్కొంది. మరోవైపు ఏక్‌నాథ్ షిండే వర్గం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి శివసేన గుర్తు తమకే ఇవ్వాలని స్పష్టం చేసింది.
మరోవైపు ఎన్నికల సంఘం విల్లు-బాణం గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేస్తే ఎలా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. దీంతో ఈ షిండే, ఉద్థవ్ వర్గాలు బి-ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాయని తెలుస్తోంది. షిండే వర్గం కత్తిని గుర్తును, ఉద్దవ్ వర్గం గధ గుర్తును ఇవ్వాలని కోరే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన దసరా వేడుకల్లో ఇరు వర్గాలు ఈ గుర్తులను ప్రదర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




