AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake in Delhi: ఢిల్లీలో భూకంపం.. ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి!

ఢిల్లీ సమీపంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దేశ రాజధానిలో భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు కంపించడంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్ 112ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Earthquake in Delhi: ఢిల్లీలో భూకంపం.. ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి!
Pm Modi
SN Pasha
|

Updated on: Feb 17, 2025 | 9:52 AM

Share

దేశ రాజధాని ఢిల్లీ అలాగే ఘజియాబాద్, నోయిడా ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, న్యూఢిల్లీ కేంద్రంగా భూకంపం ఐదు కిలోమీటర్ల లోతులో సంభవించింది. ధౌలా కువాన్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. అయితే దేశ రాజధానిలో భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు కంపించడంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత, ప్రధాని స్పందిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. పోస్ట్‌లో..”ఢిల్లీ, సమీప ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటూ భద్రతా జాగ్రత్తలు పాటించాలి. మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు” అని ప్రధాని అన్నారు.

ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు అయితే రిపోర్ట్‌ కాలేదు. కాగా, ఢిల్లీలో భూకంపం రావడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఇక్కడ 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈశాన్య ఢిల్లీలో ఏప్రిల్ 12, 2020న 3.5 తీవ్రతతో భూకంపం, మే 10, 2020న 3.4 తీవ్రతతో భూకంపం, మే 29, 2020న రోహ్‌తక్ సమీపంలో(ఢిల్లీకి పశ్చిమాన 50 కిలోమీటర్లు) 4.4 తీవ్రతతో భూకంపం, ఆ తర్వాత డజనుకు పైగా ప్రకంపనలు కనిపించాయి. భారతదేశ భూకంప జోనింగ్ మ్యాప్‌లో ఢిల్లీ భూకంప జోన్ 4లో ఉంది. ఈ ఇంట్రా ప్లేట్ ప్రాంతం హిమాలయ భూకంపాల కారణంగా మితం నుంచి అధిక ప్రమాదానికి గురవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.