ముడి చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారత్ రియాక్షన్ ఇదే..
అక్టోబర్ 9న షార్జా యాంకరేజ్ వద్ద MT GEM NO. 2 ముడి చమురు ట్యాంకర్‌పై జరిగిన డ్రోన్ దాడిపై భారత్ స్పందించింది. ఈ మేరకు భారత నావికుల క్షేమంపై ప్రకటన జారీ చేసింది. భారత నావికులు సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

అక్టోబర్ 9న షార్జా యాంకరేజ్ వద్ద MT GEM NO. 2 ముడి చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఇందులో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. తాము పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత, శ్రేయస్సును సమాచారం కోసం అధికారులు షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని స్పష్టం చేశారు. భారతీయ నావికులు పూర్తిగా క్షేమంగా ఉన్నారని, ఇది సంతోషకరమైన విషయమని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. నావికుల భద్రత కోసం దేశాల మధ్య సమన్వయం అవసరమని, అంతర్జాతీయంగా సహకారం కోసం భారత్ చర్చలు జరుపుతుందన్నారు.
షార్జా యాంకరేజ్ ప్రాంతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ప్రాంతంలో అరేబియా గల్ఫ్‌లో ఉంది. ఇటీవల గల్ఫ్ ప్రాంతంతో పాటు నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలు, నావికులపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీంతో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి షిప్‌లపై డ్రోన్ దాడులు జరగడంతో భారత్ అప్రమత్తమైంది. సముద్రంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరిగిన దాడులను దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలిగించి, అమాయకుల ప్రాణాలను బలిగొనే ఈ చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కావని పేర్కొంటున్నాయి. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం దృష్ట్యా ఇటువంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిస్తున్నాయి. సముద్రయాన కార్మికులకు ప్రధాన వనరుగా ఉన్న భారతదేశం.. వాణిజ్య నౌకలు, వ్యాపార నావికులపై పెరుగుతున్న దాడుల గురించిన ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ రిజిస్ట్రీని కలిగి ఉన్న లైబీరియాతో చేతులు కలిపింది.
