AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క.. అసలు ఏం జరిగిందంటే..?

కుక్క విశ్వాసానికి మారుపేరుగా చెప్తారు. తన ప్రాణాలను పణంగా పట్టైనా యజమాని ప్రాణాలను కాపాడుతుంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలిచాయి. ఈ క్రమంలో ఓ కుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది. ఆ కుక్కే లేకపోతే తామంత ఎప్పుడో చనిపోయేవారమని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క.. అసలు ఏం జరిగిందంటే..?
Dog Saves 67 Lives
Krishna S
|

Updated on: Jul 08, 2025 | 2:32 PM

Share

హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించగా.. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. మరోవైపు కొండచరియలు విరిగిపడుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటివరకు 16 ప్రాంతాల్లో కొండచరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదాల్లో 50మంది మరణించారు. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ కుక్క 67 మంది ప్రాణాలు కాపాడింది. కుక్క విశ్వాసానికి మారుపేరు అంటారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా తమ యజమానులను కంటికి రేప్పలా కాపాడుతాయి. ఇప్పటికే ఎన్నో సంఘటనలు దీనికి నిదర్శనంగా నిలిచాయి. మండి జిల్లాలోని సియాతి గ్రామంలో అర్ధరాత్రి ఒంటిగంటకు భారీ కొండచరియ విరిగిపడింది. ఈ అపాయం నుంచి కుక్క 67మందిని కాపాడింది.

జూన్ 30న అర్ధరాత్రి సియాతి గ్రామంపై కొండచరియ విరిగిపడింది. ఇది జరిగే కొద్ది నిమిషాల ముందు.. గ్రామంలోని నరేంద్ర అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్క అరవడం మొదలుపెట్టింది. ఏం జరిగిందా..? అని నరేంద్ర కుక్క దగ్గరికి వెళ్లాడు. బయట జోరుగా వర్షం కురుస్తుండగా.. తన ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడి వర్షం నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించాడు. వెంటనే తన ఇంట్లోని వారందరినీ తీసుకుని బయటకు వెళ్లాడు. చుట్టపక్కల వారిని సైతం అలర్ట్ చేసి ఇళ్లకు దూరంగా తీసుకుని వెళ్లాడు. అలా వారు వెళ్లిన కాసేపటికే గ్రామంపై కొండచరియ విరిగిపడింది. దీంతో కుక్కే తమ ప్రాణాలను కాపాడిందని గ్రామస్థులు చెబుతున్నారు.

కుక్క అరుపులతో ప్రాణాలతో బయటపడిన వారు.. ప్రస్తుతం త్రియంబల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించగా.. ఇతర గ్రామాల ప్రజలు సైతం ముందుకొచ్చి వారికి అండగా నిలిచారు. అయితే చాలా మంది గ్రామస్థులు రక్తపోటుతో బాధపడుతున్నారు. కాగా భారీ వర్షాలతో హిమాచల్ భారీగా నష్టపోయింది. కేంద్రం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మోడీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.