స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టిన దుర్మార్గులు.. గంటపాటు ఈడ్చుకెళ్లి.. దారుణంగా..

|

Jan 09, 2023 | 4:40 PM

నూతన సంవత్సరం రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ యువతి (23) ని కారు ఢీకొట్టి.. కొన్ని కిలోమీటర్ల పాటు ఆమెను ఈడ్చుకెళ్లింది.

స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టిన దుర్మార్గులు.. గంటపాటు ఈడ్చుకెళ్లి.. దారుణంగా..
Delhi Crime
Follow us on

నూతన సంవత్సరం రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ యువతి (23) ని కారు ఢీకొట్టి.. కొన్ని కిలోమీటర్ల పాటు ఆమెను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలై మహిళ మృతి చెందింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మహిళను కారుతో ఢీకొట్టి దాదాపు ఆమెను గంటపాటు ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని కిలోమీటర్ల మేర ఆ మహిళను కారు ఈడ్చుకెళ్లడంతో ఆమె శరీరం ఛిద్రమైందని పేర్కొంటున్నారు. సుల్తాన్‌పురి ప్రాంతంలో ఒక మహిళను కారు ఢీకొట్టిందని.. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కొన్ని కి.మీల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కారు ఢీకొనడంతో మహిళ కారు చక్రంలో ఇరుక్కుపోయిందని దీంతో ఆమె బయటపడలేకపోయిందని వెల్లడించారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఆయా ప్రాంతాల్లో ఉన్న సిసిటివి ఫుటేజీలో రికార్డయ్యాయి. మారుతీ బాలెనో కారు ఢిల్లీలోని కంఝవాలా రోడ్డులోని లాడ్‌పూర్ గ్రామంలో రోడ్డుపై యు-టర్న్ చేస్తున్నట్లు చూపిస్తుంది. అదే ప్రాంతంలో మిఠాయి దుకాణం నడుపుతున్న ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు.

ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ ఫోన్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రోహిణిలోని కంజావాల్‌ నుంచి కుతూబ్‌గఢ్‌ వైపు వెళ్తోన్న ఓ కారు.. మహిళను ఈడ్చుకెళ్తున్నట్లు సమాచారం వచ్చిందని.. ప్రత్యక్ష సాక్షి కారు నంబరు కూడా చెప్పడంతో వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. అంతలోనే రోడ్డుపై ఓ మహిళ మృతదేహం పడిఉందంటూ 4 గంటలకు కంజావాలా పోలీసులను మరో ఫోన్ కాల్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కారు నంబరు ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే ట్రేస్ చేసి.. అందులో ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో వారు మద్యం తాగి ఉన్నారా..? లేక ఆమెను హత్య చేశారా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలు అమర్‌ విహార్‌కు చెందిన అంజలిగా గుర్తించారు. పార్ట్‌ టైంగా శుభకార్యాలు, చిన్న ఫంక్షన్‌లలో పనిచేస్తుంటుందని.. ఎప్పటిలాగే ఓ కార్యక్రమంలో పాల్గొని.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

స్పందించిన కేజ్రీవాల్..

ఈ ఘటన జరగడం చాలా సిగ్గుచేటు అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘కంఝవాలాలో సోదరికి జరిగింది చాలా సిగ్గుచేటు. దోషులను కఠినంగా శిక్షిస్తారని నేను ఆశిస్తున్నాను” అంటూ ట్విట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..