సాధారణంగా వ్యాపారులు కస్టమర్స్‌ను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్స్ ప్రకటిస్తుంటారు. కొన్ని చోట్ల ఆఫర్లకు సంబంధించిన కూపన్లు ఇవ్వడం, లేదా క్యాష్ బ్యాక్ లాంటివి చేస్తారు. ఒక్కోసారి ఆఫర్లు ప్రకటించినట్టే ప్రకటించి ఏదో కారణం చెప్పి ఆఫర్ లేదని అసలు మొత్తాన్ని వసూలు చేస్తారు. కొందరైతే ఎందుకులే పదీ, ఇరవై కోసం వీళ్లతో గొడవ అని కొందరు నగదు చెల్లించి వెళ్లిపోతారు. కానీ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా వదిలేయలేదు. తననుంచి వసూలు చేసిన 60 రూపాయల కోసం ఏకంగా పదేళ్లు పోరాడాడు. అసలేం జరిగిందంటే..
దక్షిణ ఢిల్లీకి చెందిన కమల్ ఆనంద్ అనే వ్యక్తి 2013లో సాకేత్ డిస్ట్రిక్ట్ సెంటర్‌లో ఉన్న ఓ మాల్‌లోని కోస్టా కాఫీ ఔట్‌లెట్‌లో తన భార్యతో కలిసి కాఫీ తాగడానికి వెళ్లాడు. అక్కడ కాఫీ తాగితే పార్కింగ్ ఉచితం అని చెబుతూ అక్కడి ఉద్యోగి ఒకరు అతనికి ఆఫర్ స్లిప్ ఇచ్చాడు. కమల్ దంపతులు కాఫీలు తాగి, కారును పార్కింగ్ నుంచి బయటకు తీస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి పార్కింగ్ ఫీజు 60 రూపాయలు చెల్లించాలని కోరాడు. కమల్ కాఫీ షాప్‌లో తనకు వచ్చిన ఫ్రీ పార్కింగ్ ఆఫర్ టికెట్‌ను అతనికి చూపించాడు. అదంతా నాకు తెలీదు.. పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందేనని అన్నాడు. దీంతో పార్కింగ్ ఫీజు చెల్లించి కమల్ బయటకు వచ్చేశాడు. అనంతరం,
దక్షిణ ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పదేళ్లపాటు విచారణ కొనసాగింది. అయినా కమల్ విసిగిపోలేదు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న అతను గెలిచేవరకూ పోరాడుతూనే ఉన్నాడు. ‘కస్టమర్లకు ముందుగా ఆఫర్ల గురించి చెప్పి.. వారికి ఆ సేవలు అందించకుండా తిరస్కరించడం నిర్లక్ష్యం కిందకే వస్తుంది’ అని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై 61,201 రూపాయలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కమల్‌కు చెల్లించాలని ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..