ఓ దొంగల ముఠా లగ్జరీ కార్లను చోరీచేసి, అనంతరం వాటిని అమ్మేసి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ గ్యాంగ్ లీడర్‌కు వైద్యం చేయిస్తున్నారు. ఈ విధంగా దాదాపు 50కి పైగా కార్లను మూడో కంటికి తెలియకుండా మాయం చేశారు. ఐతే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠా గుట్టును ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కీ (36) అనే వ్యక్తికి ఓ గూడౌన్ ఉంది. ఇతని అనుచరులైన మాజిమ్ అలీ (25), సఫీక్ (21), రామ్ సంజీవన్ (62)లు వాహనాలను దొంగిలించి గూడౌన్‌కు తరలించేవారు. అనంతరం నలుగురు కలిసి వాటిని విడిభాగాలుగా విడగొట్టి స్క్రాప్ డీలర్లకు విక్రయించేవారు. ఇలా విక్రయించగా వచ్చిన డబ్బును ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ ముఠా నాయకుడైన అశిష్ వైద్యానికి వినియోగించేవారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఆనంద్ నికేతన్ అనే బాధితుడు తన టొయోటా ఇన్నోవా క్రిస్టా కారు జనవరి 8న చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు విషయమై ప్రత్యేక దర్యాప్తు కోసం యాంటీ-ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (AATS)ను రంగంలోకి దింపారు. వీరి పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అలీపూర్‌లోని మఖ్మేల్‌పూర్ గ్రామంలోని ఓ గూడౌన్‌లో దొంగిలించబడిన కారును గుర్తించారు. ఏఏటీఎస్ బృందం చాకచక్యంగా వ్యవహరించి జనవరి 17న రాత్రి గూడౌన్‌పై దాడి చేశారు. అప్పటికే గూడౌన్‌లో దొంగిలించబడిన కారు భాగాలను విడదీస్తున్న నలుగురు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గత నెల రోజుల్లో వీరు 20 కార్లకుపైగా దొంగిలించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. సంఘటన స్థలంలో 50కిపైగా వాహనాలకు సంబంధించిన విడిభాగాలను పోలీసులు గుర్తించారు. ఈ దొంగల ముఠాపై పలు సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.