Delhi: దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

|

Dec 14, 2022 | 3:37 PM

యువకులిద్దరూ ముఖం కనిపించకుండా మాస్క్‌ వేసుకుని ఉన్నారు. అనంతరం యువకులిద్దరూ బైక్‌పై పరారయ్యారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Delhi: దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌
School Girl
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముఖంపై యాసిడ్‌ ఎక్కువగా పడటంతో కళ్లకు తీవ్రంగా గాయమైనట్టుగా యువతి తండ్రి తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను గుర్తించామని, వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలికను సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చేర్చారు. ఢిల్లీ పోలీసు బృందం కూడా ఆసుపత్రికి చేరుకుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలలో యాసిడ్‌ ఎటాక్‌ దృశ్యాలు నమోదైంది.

ఉదయం 9 గంటల ప్రాంతంలో మోహన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థులు స్కూల్‌కి వెళ్లేందుకు నిలబడి ఉండగా ముఖానికి ముసుగు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు స్థానికులు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థిని వయస్సు 17 సంవత్సరాలు. ఆమె తన చెల్లెలితో కలిసి నిలబడి ఉంది. అంతలోనే బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆమెపై యాసిడ్‌ విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అబ్బాయిలు బైక్‌పై వచ్చి విద్యార్థినిపై యాసిడ్‌ విసిరినట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. యువకులిద్దరూ ముఖం కనిపించకుండా మాస్క్‌ వేసుకుని ఉన్నారు. అనంతరం యువకులిద్దరూ బైక్‌పై పరారయ్యారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ దృష్టి సారించింది. ద్వారకా మోడ్ సమీపంలో ఓ పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ పోశారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని చెప్పారు. దేశంలో యాసిడ్‌ను నిషేధించాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఏళ్ల తరబడి పోరాడుతోంది. కూరగాయల మాదిరిగానే మార్కెట్‌లో యాసిడ్ సులభంగా దొరుకుతుందని, దాని రిటైల్ అమ్మకాలను ప్రభుత్వం ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించారు. అలాగే ఢిల్లీ మహిళా కమిటీ కూడా చాలా ఏళ్లుగా యాసిడ్ నిషేధం కోసం పట్టుబడుతోంది. అయితే ప్రభుత్వాలు ఎప్పుడు మేల్కొంటాయని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి