కర్ణాటకలో ఇటీవల జరిగిన సీన్‌కి.. రివర్స్ సీన్ మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ.. చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తే.. మధ్యప్రదేశ్‌లో బీజేపీని నీరుగార్చడానికి కాంగ్రెస్ పన్నాగం పన్నింది. సీన్ కట్ చేస్తే…
మా పైవారు ఆదేశిస్తే… 24 గంటలు చాలు.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఇలా వ్యాఖ్యానించింది ఎవరో కాదు.. ఆ రాష్ట్రానికి చెందిన కమలం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. అదిష్టానం నుంచి ఆదేశాలు వస్తే.. కర్ణాటకలో కుప్పకూలినట్లు ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ పవర్‌లోకి వస్తుందంటూ గోపాల్ భార్గవ అనే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయంలో పెనుదుమారం రేపాయి.
అయితే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్.. ఆ బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని సీఎం అన్నారు. అంతేకాదు.. తమవైపు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓ బిల్లుకు కూడా వారు మద్ధతిచ్చినట్లు తెలుస్తోంది.
బుధవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షాస్మృతి సవరణ బిల్లుకు మద్దతుగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్ ఓటు వేశారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను.. కాంగ్రెస్ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు అనుకూలంగా ఓటేసిన ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎవరికి తెలియని ప్రదేశంలో గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇవాళ సీఎం ఇచ్చే విందుకు కూడా ఆ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు పుకార్లు వస్తున్నాయి. కర్ణాటక జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఎటువైపుంటారనేది ఆసక్తి రేపుతోంది.