Crypto Currency: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ చట్టబద్ధతపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక కార్యదర్శి సోమనాథన్.. ఏమన్నారంటే?

బిట్‌కాయిన్ లేదా ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీలు భారతదేశంలో ఎప్పటికీ చట్టబద్ధం కావని కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ స్పష్టం చేశారు.

Crypto Currency: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ చట్టబద్ధతపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక కార్యదర్శి సోమనాథన్.. ఏమన్నారంటే?
Somanathan
Follow us

|

Updated on: Feb 02, 2022 | 6:43 PM

Crypto Currency Bitcoin: బిట్‌కాయిన్(Bitcoin) లేదా ఎథెరియం(Ethereum) వంటి క్రిప్టోకరెన్సీ(Crypto Currency)లు భారతదేశంలో ఎప్పటికీ చట్టబద్ధం కావని కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్(TV Somanathan) స్పష్టం చేశారు. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలని సోమనాథన్‌ సలహా ఇస్తూ, అందులోని పెట్టుబడికి గ్యారెంటీ ఉండబోదన్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించదని ఆయన క్లారిటీ ఇచ్చారు. దేశ ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో ఆయన ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్, ఎథెరియం లేదా నాన్ ఫంగబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టి ) చట్టపరమైన టెండర్ లేదా లీగల్ టెండర్‌గా ప్రకటించడం జరగదని సోమనాథన్ చెప్పారు. క్రిప్టో అసెట్‌కు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆమోదం లభించలేదని, దాని ధర ప్రైవేట్‌గా నిర్ణయించడం జరుగుతుందని సోమనాథన్ చెప్పారు.

బిట్‌కాయిన్ అయినా , ఎథెరియం అయినా, ఎన్‌ఎఫ్‌టీ అయినా.. వీటిని ఎప్పటికీ లీగల్ టెండర్‌గా ప్రకటించబోమని ఆర్థిక కార్యదర్శి స్పష్టంగా చెప్పారు. క్రిప్టో ఆస్తి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ధర లేదా విలువ నిర్ణయించబడే ఆస్తి అన్నారు. మీరు బంగారం కొనుగోలు చేసినా, వజ్రం కొనుగోలు చేసినా, క్రిప్టో కొనుగోలు చేసినా ప్రభుత్వం వాటి ధరలకు ప్రభుత్వ హామీ ఉండదన్నారు.

క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలని ఆర్థిక కార్యదర్శి సోమనాథన్‌ సలహా ఇస్తూ, మీ పెట్టుబడి విజయవంతమవుతుందా లేదా అనే గ్యారెంటీ లేదన్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. మరోవైపు పెట్టుబడికి పూర్తిగా సురక్షితమైన సొంత డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీని ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న విడుదల చేసిన సాధారణ బడ్జెట్‌లో రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని జారీ చేయడంపై చర్చ జరిగింది. దీని ప్రారంభం ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరగనుంది. డిజిటల్ కరెన్సీ సురక్షితమని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ ఎప్పటికీ డిఫాల్ట్ కాదని ఆర్థిక కార్యదర్శి సోమనాథన్ అన్నారు. డిజిటల్ రూపాయి డబ్బు RBIకి చెందినది, కానీ దాని రూపం పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. RBI జారీ చేసే డిజిటల్ కరెన్సీ చట్టబద్ధమైన టెండర్ లేదా చెల్లుబాటు అయ్యే కరెన్సీ. ఇది కాకుండా, ఏదైనా క్రిప్టో ఆస్తి లేదా క్రిప్టోకరెన్సీ, అవి చెల్లుబాటు కావు, భవిష్యత్తులో చెల్లుబాటు అయ్యేవి కావని సోమనాథన్ క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ ఆదాయం మినహా ప్రతి ఆదాయంపై పన్ను విధిస్తారు. క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం స్పష్టత లేదు. క్రిప్టో ఆదాయాలు వ్యాపార ఆదాయమా లేదా మూలధన లాభాలా లేదా ఊహాజనిత ఆదాయమా అనేది కూడా స్పష్టంగా లేదు. కొందరు వ్యక్తులు తమ క్రిప్టో ఆస్తులను ప్రకటిస్తారు. కొందరు వాటి గురించిన ప్రస్తావించడం లేదు. ఇక నుంచి కేంద్ర బడ్జెట్ 2022 ప్రతిపాదనల ప్రకారం.. క్రిప్టోకరెన్సీపై ప్రతి ఒక్కరూ 30% చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం క్రిప్టోకు మాత్రమే కాదు, అన్ని ఊహాజనిత ఆదాయానికి కూడా వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉదాహరణకు, ఎవరైనా గుర్రపు పందెలా ద్వారా వచ్చే ఆదాయంపై కూడా 30 శాతం టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఏదైనా ఊహాజనిత లావాదేవీలపై ఇప్పటికే 30 శాతం పన్ను విధించడం జరుగుతుంది. కాబట్టి క్రిప్టోపై కూడా 30 శాతం పన్ను నిబంధనను తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు.

కాగా, Ethereum అసలు విలువ ఎవరికీ తెలియదని ఆర్థిక కార్యదర్శి అన్నారు. దీని ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తి క్రిప్టో నుండి సంపాదిస్తే, అతను 30 శాతం పన్ను చెల్లించాల్సిందేనని సోమనాథన్ పేర్కొన్నారు.

Read Also…. Banks: ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్.. రూల్స్ మార్చిన బ్యాంకులు..